Telangana Gas Cylinder Scheme Beneficiaries :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌లో మరో 4.60లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మహాలక్ష్మి పథంకంలో భాగంగా రాయితీ సిలిండర్లు ఇస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఈ సంఖ్య తాజాగా 44,10,816 కుటుంబాలకు చేరింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27న ప్రారంభించినప్పుడు 39,50,884 కుటుంబాలు లబ్ధిపొందాయి. ప్రజాపాలన కేంద్రాల్లో సవరణలకు అవకాశం ఇవ్వడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 5 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 76.64 లక్షల సిలిండర్లకు ప్రభుత్వం రాయితీ విడుదల చేసినట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్యాస్ వినియోగదారులకు రూ.227.42 కోట్ల రాయితీని ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,20,39,994 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్ కార్డున్నవారు ఈ పథకానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 89.99 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. 91,49,838 మంది దరఖాస్తు చేసుకోగా మొదట 39.50 లక్షల కుటుంబాలు మాత్రమే అర్హులుగా గుర్తించారు.
ఈ పొరపాట్లు : దరఖాస్తుల్లో కొన్ని నమోదు కాకపోవడం, కొందరి ఇళ్లలో రెండేసి గ్యాస్ కనెక్షన్లు ఉండటం, మరికొందరు రాయితీని వదులుకోవడం, దరఖాస్తులో సరైన వివరాలు నింపకపోవడం వంటి కారణాలు లబ్ధిదారుల సంఖ్యపై ప్రభావం చూపాయని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులో యూనిక్ ఐడీ కాకుండా కన్స్యూమర్ ఐడీ రాయడంతో చాలామందికి రాయితీ రాలేదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం - గైడ్ లైన్స్ ఇవే
ప్రతి ఆయిల్ కంపెనీ వినియోగదారు సంఖ్యతో పాటు యూనిక్ ఐడీ ఇస్తాయి. ఇందులో 17-19 నంబర్లు ఉంటాయి. ఈ సంఖ్యను దరఖాస్తు ఫారంలో రాయనివారు ప్రజాపాలన కేంద్రాల్లో సవరణతో లబ్ధి పొందుతున్నారు. ఆధార్ సంఖ్యలో తప్పు రాసినా సరిదిద్దుకోవచ్చని పౌరసరఫరాలశాఖ వర్గాలు వెల్లడించాయి. గ్యాస్ రాయితీ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికి, వారికి అర్హత ఉన్న సిలిండర్ల సంఖ్య మేరకు రాయితీ అందిస్తామని పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ ఈటీవీ భారత్’తో పేర్కొన్నారు.
జిల్లాల వారిగా లబ్ధిదారులు :మొత్తం 44,10,816 కుటుంబాలు గ్యాస్ లబ్ధిదారులుగా ఉంటే.. ఇందులో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 4,23,993 కుటుంబాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత నల్గొండలో 2,38,251, ఖమ్మం 2,31,898, నిజామాబాద్ 2,24,865 కుటుంబాలతో తర్వాత ప్లేసెస్‌లో ఉన్నాయి. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 60,934, భూపాలపల్లి 65,258, వనపర్తి 73,768, ఆసిఫాబాద్‌లో 74,347 కుటుంబాలు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నాయి.
48గంటల్లో రాయితీ :గ్యాస్ రాయితీ సొమ్ము వినియోగదారుల ఖాతాల్లో జమయ్యేందుకు కొన్నిసార్లు నాలుగైదు రోజుల సమయం పడుతోంది. 2 రోజుల్లో జమయ్యేలా చూడాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ కేంద్ర చమురు, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురీని కలిసి ప్రభుత్వం చెల్లించే రాయితీ కస్టమర్లకు 48 గంటల్లో అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
మీకు గ్యాస్ సబ్సిడీ రావట్లేదా? - ఇంకా కేవైసీ పూర్తి చేయలేదా? - ఇలా చేయండి!
రూ.500లకు గ్యాస్ సిలిండర్ కావాలంటే తప్పనిసరి కేవైసీ అంటూ పుకార్లు - క్యూ కట్టిన వినియోగదారులు