Gas and Current Bill Issues in Telangana :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలనుకున్న ఆరు గ్యారంటీల అమలులో అధికారుల నిర్లక్ష్యం దరఖాస్తుదారులను నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నా పథకాలు అమలు కాకపోవడంతో అర్జీలను పరిష్కరించుకోవడానికి కరీనంగర్ వాసులు బారులుతీరుతున్నారు. విద్యుత్తు జీరో బిల్లు (Zero Bills) రానివారు, వంటగ్యాస్‌కు రాయితీ మొత్తం జమకాని వారంతా సేవా కేంద్రాలకు వచ్చి వివరాలు అందిస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తులు కంప్యూటరీకరణ విషయంలో జరిగిన తప్పుల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్క దరఖాస్తులోనే వంట గ్యాస్‌తో పాటు విద్యుత్ బిల్లుల రాయితీ, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Karimnagar Zero Current Bills Issue : ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా పథకం అమలు కాకపోతే మండల పరిషత్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. కరీంనగర్ పాలక కార్యాలయం దరఖాస్తుదారులతో కిక్కిరిసిపోతోంది. వందల సంఖ్యలో దరఖాస్తుదారులు ఒకేసారి రావడంతో అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో ఎనిమిది ప్రాంతాల్లో లోటుపాట్లను సరి చేసుకోవచ్చని సూచించినా అందరు కార్పొరేషన్ కార్యాలయానికి వస్తుండటంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.
అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇక నో టెన్షన్ - గృహజ్యోతి వారికి కూడా వర్తింపు
"ప్రజాపాలన సేవా కేంద్రంలో కావాల్సిన అన్ని పత్రాలు ఇచ్చాం. విద్యుత్ అధికారులు ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. మళ్లీ కరెంటు, గ్యాస్ బిల్లులు వచ్చాయి. మాకు వయసైపోయింది. ఈ వయసులో ఇంత పెద్ద క్యూలో ఉండి పనులు చేయించుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తోంది. వివరాలు సేకరిస్తున్న అధికారులు పని సరిగ్గా చేసి ఉంటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు కదా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులనే ఇళ్ల వద్దకు పంపించి సరిగ్గా వివరాలు సేకరించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం." - బాధితులు