Gannavaram Airport Increased Demand : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో గన్నవరం విమానాశ్రయానికి డిమాండ్ పెరిగింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో గన్నవరం నుంచి పౌరవిమానయాన సేవలు నిస్తేజంగానే సాగాయి. ఇప్పుడు కొత్త రూట్లకు భారీగా రద్దీ ఉంటోంది. 2019లోనే 12లక్షల మంది రాకపోకలు సాగించారు. ప్రస్తుతం తగినన్ని సర్వీసులు లేక ఏటా 10 లక్షల మంది కూడా ప్రయాణం చేయలేకపోతున్నారు.
ఐదేళ్లుగా ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ :గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. అక్కడి నుంచి ఏ దేశానికైనా, నగరానికైనా కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా అవి అత్యంత రద్దీగా నడుస్తుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. తాజాగా ముంబయికి నడుపుతున్న సర్వీసులు, గతంలో వారణాశి, దిల్లీ, చెన్నై, బెంగళూరు, కొచ్చి, వారణాశి, హైదరాబాద్, షిర్డీ ఇలా ఏ నగరానికి కొత్తగా వేసినా ఆక్యుపెన్సీ రేషియో అత్యంత ఎక్కువ ఉంటోంది. గత వైసీపీ సర్కారు గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. గత ఐదేళ్లలో విమానాశ్రయం నుంచి నూతన సర్వీసులను ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటినీ ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు. షిర్డీ, వారణాశి, ముంబయి, కొచ్చి సహా పలు ప్రాంతాలకు పూర్తిగా సర్వీసులు ఆగిపోయాయి.
అన్నీ మంచి శకునములే!- గన్నవరం విమానాశ్రయ విస్తరణపై కొత్త ఆశలు - Gannavavaram Airport
జగన్ గద్దెనెక్కాక తలకిందులైన గన్నవరం : తాజాగా కూటమి సర్కారు అధికారంలోకి రావటం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ బాలశౌరి చొరవతో కొత్తగా ముంబయికి సర్వీసులు ఏర్పాటు చేశారు. గన్నవరం నుంచి ప్రస్తుతం రాకపోకలు సాగించే సర్వీసులు ప్రస్తుతం 46 ఉన్నాయి. 2019 నాటికే ఇక్కడి నుంచి రోజుకు 60 సర్వీసులకు పైగా రాకపోకలు సాగించేవి. ఏటా 12 లక్షల మంది రాకపోకలు సాగించేవాళ్లు. 2015 నుంచి వరుసగా నాలుగేళ్లు దేశంలోనే అత్యంత ఎక్కువ ప్రయాణికుల వృద్ధి కలిగిన విమానాశ్రయంగా రికార్డు నెలకొల్పింది. 2015-19 మధ్య కొత్త సర్వీసుల ఏర్పాటుతో ప్రయాణికులు భారీగా పెరిగారు. 2024 నాటికి కనీసం 15లక్షల మంది దాటుతారని ఆరేళ్ల కిందట అంచనా వేశారు కానీ జగన్ గద్దెనెక్కాక గన్నవరం పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం సర్వీసులు తగ్గిపోవడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది.