Ganja Smuggling in AP : మంచి పనులు చేసేందుకు ఆలోచన రాదు కానీ అక్రమంగా సంపాదించేందుకు ఐడియాలు మాత్రం కోకొల్లలు. రోజుకో కొత్త ఆలోచనతో పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు గంజాయి స్మగ్లర్లు. గంజాయిని వివిధ తరహాలో స్మగ్లింగ్ చేసి అడ్డదారిలో సంపాదించడమే కాకుండా యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఎవ్వరికీ అనుమానం రాకుండా సిగరెట్లలో గంజాయిని దట్టించి, బడ్డీకొట్లలో పొట్లాలుగా కట్టి విక్రయిస్తున్నాయి గంజాయి ముఠాలు. అలాగే కోడ్ భాషను వాటిని సరఫరా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో తరచూ జరుగుతున్నాయి.
రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్, రోడ్లపైనే గొడవలు పెట్టుకోవడం షరా మామూలైంది. గంజాయి ముఠాలు సరకు ఎంత కావాలంటే అంత ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేస్తున్నాయి. కనిగిరి, దర్శి, పామూరు, పొదిలి, కొండపి, టంగుటూరు తదితర ప్రాంతాల్లో బడ్డీకొట్లనే కేంద్రాలుగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఫలితంగా ఎంతో మంది యువత దీని బారిన పడుతున్నారు.
సిగరెట్లలో గంజాయి : బడ్డీకొట్లలో 50, 100 గ్రాముల పరిమాణంలో పొట్లాలుగా కట్టి రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో కనిగిరి పట్టణంలో రెండు సార్లు ఇలాగే అమ్ముతూ పోలీసులకు నిందితులు చిక్కారు. మరికొందరు దుకాణదారులు సిగరెట్లలో గంజాయి దట్టించి ఒక్కొక్కటి రూ.300 వరకు అమ్ముతున్నారు. కనిగిరి మున్సిపాలిటీలోని దుర్గం దొరువు గంజాయికి అడ్డాగా మారిందని ఇటీవల పోలీసుల విచారణలో తేలింది. వృద్ధాశ్రమం, మంగళమాన్యం, కొత్తూరు, ఒంగోలు బస్టాండ్, గార్లపేట రోడ్డు, గ్యాస్ గోడౌన్, శివనగర్ కాలనీ వాటర్ ప్లాంటు, అర్బన్ కాలనీ తదితర ప్రాంతాల్లో కొంత మంది ఇదే పనిగా వ్యాపారం సాగిస్తూ యువతను మత్తులోకి దించుతున్నారని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోడ్ భాషలో విక్రయాలు : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, అనకాపల్లి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల్లో గంజాయిని తాళ్లూరు మండలం తూర్పుగంగవరం, పొదిలి, నెల్లూరు జిల్లా కందుకూరుకు చేర్చుతున్నారు. అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. అక్కడ కిలో రూ.5 వేలకు కొనుగోలు చేసి ఇక్కడ కిలో రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు విక్రయిస్తున్నారు. తెలిసిన వారికి కోడ్ భాషలో తెలిపి, వారు అడిగితేనే సరకు చేరవేస్తారు. నాలుగు నెలల క్రితం కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ వద్ద గల ఓ హోటల్‌లో పనిచేస్తున్న సర్వర్‌ను గంజాయి మత్తులో ముగ్గురు యువకులు చితకబాదారు. ఇటీవల పట్టణంలో చెప్పుల బజారు సమీపంలోని ఓ హోటల్ వద్ద కొందరు యువకులు గంజాయి మత్తులో గొడవపడి దారిన పోయే వారిని కొట్టారు.