Thefts Training In Hyderabad : మోసాలు, దొంగతనాల్లో ఆరితేరిన ముఠాలు ఆనవాళ్లు బయటకు తెలియకుండా నయా మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. యువత, మైనర్లను ముందుంచి నేరాలు చేయిస్తున్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాన్ని కొట్టేయటం నుంచి నకిలీ అధికారుల రూపంలో బురిడీ కొట్టించటం దాకా నేర్పిస్తున్నాయి. అనంతరం వారిని ఆయా బృందాలకు నాయకులుగా నియమిస్తున్నాయి. మోసాల్లో ఎక్కువ సంపాదించిన వారికి రెండు మూడు రెట్లు జీతం అదనంగా ఇస్తున్నాయి.
ఉదాహరణలివే :అతడు ఓ పాతబస్తీ నేరస్తుడు. వందకు పైగా కేసుల్లో జైలుకు వెళ్లాడు. సొమ్ము కొట్టేసేందుకు కొత్త మార్గం ఎంచుకున్నాడు. పనీపాటలేకుండా ఖాళీగా ఉండే యువకులకు బిర్యానీ, బైక్‌లపై తిరిగేందుకు పెట్రోల్ ఖర్చులు ఇస్తూ సెల్‌ఫోన్ల దొంగతనం నేర్పించాడు. నగరంలో రాత్రిళ్లు వివిధ ప్రాంతాల్లో వారు తిరుగుతూ చోరీ చేసిన మొబైల్ ఫోన్లను దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు.
ఇటీవల బహదూర్‌పురలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడి పక్కనే కూర్చున్న బాలుడు, జేబులోని నగదు కొట్టేశాడు. చాదర్‌ఘాట్ వద్ద మరో యువకుడు ఓ వ్యక్తి మొబైల్ లాక్కొని పారిపోయాడు. సీసీటీవీ దృశ్యాల ద్వారా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు కమీషన్ వస్తుందనే ఆశతో నేరాలకు పాల్పడ్డామని, వారుండే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు చోరీలపై శిక్షణ ఇచ్చారంటూ సమాధానమిచ్చారు.