Ganesh Immersion In Artificial Pond Hyderabad: గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసే విగ్రహాలను సహజ నీటి వనరుల్లో నిమజ్జనం చేసి నీటిని కలుషితం చేయొద్దని హైకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పలు చోట్లు కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 71 కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేశారు. వీటిలో ఖైరతాబాద్ జోన్ పరిధిలో 13, శేరిలింగంపల్లి జోన్‌లో 13, ఎల్పీనగర్, సికింద్రాబాద్ జోన్‌లలో చెరో 12, కూకట్‌పల్లి జోన్‌లో 11, చార్మినార్ జోన్‌లో 10 కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేశారు.
వినాయకుల నిమజ్జనం కోసం కృత్రిమ నీటి కొలనులు వినాయక మండపాల నిర్వాహకులకు అనువుగా ఉండేలా నగర వ్యాప్తంగా పలు చోట్ల కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేశారు. విగ్రహాలను నిమజ్జనం చేయడంతో పాటు వెంటనే వ్యర్థాలను తొలగించేలా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్ చెరువులోనే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న కృత్రిమ నీటి కొలనులో నిమజ్జనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కృత్రిమ నీటి కొలనుల చుట్టూ పరిశుభ్రమైన వాతావారణం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంకుల ద్వారా నీటిని తీసుకొచ్చి నీటి కొలనులను నింపుతున్నారు.
తెల్లవారు నుంచే మొదలు కానున్న నిమజ్జనాలు :భక్తులు ఏడాది పొడవునా ఎదురు చూసే వినాయక నిమజ్జన వేడుకకు రంగం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న లంబోదరుడి విగ్రహాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే గంగ ఒడికి బయల్దేరనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఆయా ప్రభుత్వ శాఖలు ఇప్పటికే పూర్తి చేశాయి. గతంతో పోలిస్తే ఈ దఫా గణపతి మండపాలు పెరిగాయి.