Game Changer Pre Release Event in Rajamahendrawaram:రాజమహేంద్రవరంలో గేమ్‌ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి నెలకొంది. తమ అభిమాన నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం కోసం మూడేళ్లుగా ఎదురుచూసిన మెగా అభిమానుల ఎదురుచూపులకు జనవరి 10న తెరపడనుంది. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ఇవాళ రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం-వేమగిరి జాతీయ రహదారి పక్కన భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కూడా హాజరుకానున్న నేపథ్యంలో అటు అధికారులు, ఇటు చిత్ర బృందం భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఈవెంట్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు లక్ష మంది అభిమానులు వేడుకను వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి: ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పరిశీలించారు. అంతే కాకుండా భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌తో మాట్లాడారు. అభిమానుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచించారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ రద్దీ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కాగా బాబాయ్ - అబ్బాయ్ ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారని ఇది అభిమానులకు కన్నులపండుగ అవుతుందని మంత్రి తెలిపారు.