ఆస్తులు లాక్కోవడం , బెదిరించడం, కొట్టడం, కబ్జాలు చేయడం, వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్‌లు చేయడం బెట్టింగ్‌లకు పాల్పడడం ఇవీ వైఎస్సార్సీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు గడ్డం గ్యాంగ్ ఆగడాలు. తమ పార్టీకి చెందిన వారు కాకపోతే ఏం చేయడానికైనా ఈ గ్యాంగ్ రెడీగా ఉండేది. నాని అండ చూసుకొని ఈ ముఠా రెచ్చిపోయేది. ఐదేళ్లపాటు నియోజకవర్గంలో ఈ అరాచక శక్తులు తమ ఇష్టానుసారం వ్యవహరించింది. ప్రజలకు కంటి నిండా కునుకు కరవైంది. 2022 డిసెంబర్లో తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో గడ్డం గ్యాంగ్‌కు చెందిన వారిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆ గ్యాంగ్ సభ్యులు సాగించిన ఆరాచకాలను ఇప్పటికీ ప్రజలు మరచిపోలేదు.
- వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్ల కాలంలో గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని అండ చూసుకుని గడ్డం గ్యాంగ్ రెచ్చిపోయింది. పట్టణంలో ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జాలకు పాల్పడ్డారు. ఆస్తుల వివాదాలను సెటిల్ చేశారు. టీడీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేయడం వంటి వాటికి పాల్పడేవారు. అధికారులను సైతం బెదిరించి విధులకు ఆటంకం కలిగించిన ఘటనలు ఉన్నాయి. రెండు సంవత్సరాల కిందట మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును సైతం చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. పెట్రోలు ప్యాకెట్లు, మారణాయుధాలతో తెలుగుదేశం కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు టీడీపీ వారిపైనే లాఠీఛార్జి చేయడం గమనార్హం.
- గుడివాడ పట్టణ పరిధి అతి ఖరీదైన ప్రాంతమైన బైపాస్ రోడ్ సమీపంలోని చైతన్య హౌసింగ్ సొసైటీకి సుమారు 8 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ భూములను గడ్డం గ్యాంగ్ అడ్డగోలుగా ఆక్రమించింది. దీనికోసం అక్కడ ప్లాట్లు కొన్నవారిని కె కన్వెన్షన్‌కు తీసుకెళ్లి కట్టేసి కొట్టారు. ఆపై వారిని బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. సదరు ప్లాట్లను సర్వే చేయడానికి వచ్చిన అధికారులను బెదిరించి వెనక్కి పంపించారు. అక్రమంగా ఫ్లాట్లను సొంతం చేసుకున్నారు వాటిలోకి ఎవరు వచ్చినా దాడులకు పాల్పడ్డారు.
- బైపాస్ రోడ్డుకు సమీపంలోని టీచర్స్ కాలనీలో ఉండే ఓ ప్రైవేట్ పాఠశాల స్థలం వ్యవహారంలో గడ్డం గ్యాంగ్ తలదూర్చింది. రూ.5 కోట్ల విలువైన స్థలాన్ని సుమారు రూ.3 కోట్లకు బలవంతంగా అమ్మించారు. ఆపై రూ.రెండు కోట్లను ఆ గ్యాంగ్ సొంతం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సదరు స్థలం యజమాని బలవంతంగా తన స్థలం అమ్మించారంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ స్థలం వివాదంలో ఉంది.
- గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఓ దుకాణాన్ని బలవంతంగా ఖాళీ చేసి సొమ్ము చేసుకున్నారు.
- గుడివాడలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుమారుడిని బెదిరించి ఆస్తులు రాయించుక్ను ఘటనలో కాళీ ప్రధాన పాత్రధారి. తరమిరిశ శివారులో కొడాలి నాని అనుచరులు నిర్వహించిన జూద కేంద్రంలో ప్రధాన వాటాదారుడిగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఎలాంటి ధరావత్తు చెల్లించకుండా రెండు దుకాణాలు సొంతం చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. చైతన్య హౌసింగ్ సొసైటీ స్థలాలు ఆక్రమించాడు. వాటిలో నిత్యం కొందరు యువకులను అడ్డుపెట్టుకుని కోడిపందేలు, జూదం నిర్వహించాడు.
మెరుగుమాల కాళీ ఎంబీఏ పూర్తి చేసి కొడాలి నాని వద్దకు చేరాడు. అక్కడి నుంచి మొదట గుడివాడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌ల ద్వారా అక్రమ సంపాదన ప్రారంభించాడు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే విశాఖపట్నంలో ఓ స్థలం సెటిల్‌మెంట్‌లో తలదూర్చాడు. అప్పటి మంత్రి కొడాలి నాని అండతో అక్రమ సంపాదనకు తెగబడ్డాడనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత నుంచి అతను ముఠాను ఏర్పాటు చేసి నూజివీడులోని మామిడితోటలు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవాడు. భారీగా ఆర్జించడంతోపాటు నగదు ఇవ్వకపోతే దాడి చేసేవారు.