Friends murder his Friend :ఆటో మరమ్మతులు చేసే విషయంలో స్నేహితుల మధ్య జరిగిన వివాదంలో ఒకరిని మరో నలుగురు మిత్రులు పథకం ప్రకారం హత్య చేశారు. మృతదేహాన్ని ఓ ఫ్యాక్టరీ పక్కన రహదారి వద్ద పడేశారు. ఈ కేసులో పోలీసులు మృతుడి వాట్సాప్ స్టేటస్ ఆధారంగా నిందితులను గుర్తించారు. అనంతరం నిందితులను కటకటాల్లోకి పంపించారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి :మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్‌లోని బాలానగర్ డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ ఎస్‌వోటీ విశ్వ ప్రసాద్, బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, బాలానగర్ ఇన్‌స్పెక్టర్ నర్సింహరాజుతో కలిసి డీసీపీ కె.సురేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. జగద్గిరిగుట్ట అంబేడ్కర్ నగర్‌కు చెందిన కృష్ణగౌడ్ అలియాస్ కిట్టు (39) ఆటో నడుపుతూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. అతడికి గాజులరామారానికి చెందిన ఆకుల కృష్ణ ముదిరాజ్, సనత్‌నగర్‌కు చెందిన గుర్రం నరేశ్, మాదరబోయిన రవి, గంబు శంకర్‌గౌడ్‌లు మిత్రులు.
ఇటీవల ఆటో మరమ్మతుల విషయంలో కృష్ణ ముదిరాజ్‌తో కృష్ణగౌడ్‌కు రూ.500 విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఆ టైంలో కృష్ణగౌడ్ అసభ్య పదజాలంతో తిట్టాడు. అంతకుముందు కూడా మద్యం మత్తులో ఉన్న టైంలో స్నేహితులను దూషించాడు. అందరూ ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు. హత్య చేయాలని పథకం వేశారు. జనవరి 29న దావత్ ఇస్తామని ఆటోలో మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగారు. అదే రోజు రాత్రి 10.30కు తిరిగి హైదరాబాద్ నగరానికి బయల్దేరారు. దారి మధ్యలో ఆటోలోనే అందరూ కలిసి విచక్షణా రహితంగా కృష్ణగౌడ్‌ను కొట్టారు. దీంతో కృష్ణగౌడ్ అక్కడే మృతి చెందాడు.