Free Tour Program for Govt Students in Telangana : ఉరిమే ఉత్సాహం, సరికొత్త ప్రాంతాలు పర్యటించాలన్న ఆసక్తి మెండుగా ఉన్న స్టూడెంట్స్‌కు శుభవార్త. తెలంగాణ సర్కార్ పాఠశాల స్థాయి విద్యార్థులకు పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ‘తెలంగాణ దర్శిని’ పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాఠశాల స్థాయిలో రెండో తరగతి నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 12.10 కోట్లు రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గవర్నమెంట్ పాఠశాలలు, కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమం కింద చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
ఉమ్మడి జిల్లాకు రూ. 36 లక్షలు :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులు పర్యాటక ప్రాంతాలను ఆనందంగా సందర్శించటమే లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్యను అనుసరించి, నిధులను త్వరలో ఖరారు చేయనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 3 వేల మంది విద్యార్థులు టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శించేందుకు రూ.36 లక్షలు కేటాయించే అవకాశం ఉంది.
దసరా తర్వాత 'దర్శిని'కి శ్రీకారం :విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్లి, వారికి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎకో టూరిజం, ఆర్ట్, క్రాఫ్ట్, వారసత్వం, సాంస్కృతిక, చారిత్రక, శాస్త్రీయ ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను సందర్శించేలా ప్లాన్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దసరా సెలవులు ముగిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.