Gang Rape of Nursery Worker in East Godavari District :వారిది నిరుపేద కుటుంబం. ఆ దంపతులు ఉపాధి కోసం ఒడిశా నుంచి ఏపీలో తూర్పుగోదావరి జిల్లాకు వలస వచ్చారు. నర్సరీల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, దివ్యాంగురాలైన కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికలాగానే కూలి పనుల కోసం నర్సరీకి వెళ్లిన మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆపై కాల్వలో పడేసి హతమార్చారు. ఈ దారుణమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడిని నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఏపీలో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో 43 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు చాలా కాలంగా కడియం మండలంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, దివ్యాంగురాలైన కుమార్తె ఉన్నారు. నర్సరీల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత నెల 15న కూడా ఆ మహిళ నర్సరీలో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆదే గ్రామానికి చెందిన వెలుబుడి ప్రవీణ్, దేవర ఏసు, లోకిన జయప్రసాద్, ఇతర ప్రాంతానికి చెందిన దాసరి సురేష్‌లు కోరిక తీర్చమంటూ బలవంతం చేశారు.
కాల్వలో మహిళ మృతదేహం :ఈ నేపథ్యంలో ఆమె ప్రతిఘటించడంతో సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఆమె ప్రాణాలతో ఉందో లేదో అని కూడా తెలియని పరిస్థితుల్లో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆపై అదేరోజు రాత్రి 9 గంటలకు మహిళలను పంటకాల్వలో పడేశారు. అప్పటికే ఆమె చనిపోయారా ? లేదా బతికే ఉన్నారని అన్నది పోస్టుమార్టమ్ రిపోర్టులో తెలియాల్సి ఉంది. బాధిత మహిళ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యలు గత నెల 16న కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, గత నెల 17న ఆలమూరు మండలం చొప్పెళ్ల వద్ద కాల్వలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు.