ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాన్నే రియల్‌ హీరో - అమ్మే దైవం' అంటున్న డాక్టర్​ సిస్టర్స్​

ఒకే ఇంట్లో నలుగురు ఆడపిల్లలు వైద్య విద్యలోకి - స్ఫూర్తిమంత్రంగా అక్కాచెల్లెళ్ల చదువుల ప్రస్థానం

four_sisters_in_a_family_are_studying-_medicine_and_cracked_neet
four_sisters_in_a_family_are_studying-_medicine_and_cracked_neet (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 10 hours ago

Four Sisters In a Family Are Studying Medicine And Cracked Neet :కన్న తల్లి గొంతు క్యాన్సర్‌తో చనిపోయింది. తోడబుట్టిన అన్న అనారోగ్య సమస్యతో దూరమయ్యారు. ఆ సంఘటనలు ఆయన్ను కదిలించాయి. తన బిడ్డలను ఎలాగైనా వైద్యులను చేయాలనే సంకల్పం మనసులో బలంగా నాటుకుంది. నలుగురు ఆడపిల్లలు పుట్టినా నిరాశ చెందలేదు. ‘మిషన్‌ కుడుతూ ఇంతమందిని ఎలా పెంచిపోషిస్తావా అంటూ’ ఇరుగుపొరుగు, బంధువుల సూటిపోటి మాటలు బాధిస్తున్నా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. తన రెక్కల కష్టంతో, భార్య సహకారంతో నలుగురు ఆడ పిల్లలనూ చదివించారు. పిల్లలూ సైతం నాన్న ఆశయాన్ని అర్థం చేసుకుని చదువులో పోటీపడ్డారు.

ఇద్దరు అమ్మాయిలు వైద్య విద్య కొనసాగిస్తుండగా, మరో ఇద్దరు తాజాగా ఎంబీబీఎస్‌ (MBBS)లో చేరి ‘మా ఇల్లు తెల్లకోటుకు పుట్టినిల్లు’ అని నిరూపించారు. నలుగురు అక్కాచెల్లెళ్లు సాగించిన చదువుల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి, మరెన్నో కష్టనష్టాలున్నాయి. వాటిని ఎలా అధిగమించారో ఇటీవలే వైద్య విద్యలో ప్రవేశం పొందిన కవలలైన రోహిణి, రోషిణి వెల్లడించారు.

"మాది తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలోని నర్సాపూర్‌ కాలనీ. అమ్మానాన్నలు కొంక రామచంద్రం (శేఖర్‌), శారద. నాన్న చిన్నప్పుడే దర్జీ వృత్తి చేపట్టి నేటికీ దాన్నే కొనసాగిస్తున్నారు. అమ్మ కూడా పని చేర్చుకుని నాన్నకు చేదోడుగా ఉంటోంది. మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. మమత, మాధురి, రోహిణి, రోషిణి. మేమిద్దరం కవలలం. అమ్మానాన్నలు వృత్తి నైపుణ్యంతో రెక్కల కష్టాన్ని నమ్ముకొని సంపాదించిన ఒక్కో రూపాయి పోగేసి మమ్మల్ని కష్టపడి చదివించారు." - రోహిణి, రోషిణి

‘మమత’తో మొదలు : తొలుత అక్క మమత నాన్న కలల్ని సాకారం చేసే లక్ష్యానికి బలమైన పునాది వేసింది. ఎంతో కష్టపడి చదివింది. పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. అనంతరం ఇంటర్‌ ఎక్కడ చదవాలనే ప్రశ్న తలెత్తింది. ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం ముందుకొచ్చి ఫీజులో రాయితీ ఇవ్వడంతో హైదరాబాద్‌లో ఇంటర్​లో చేరింది. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించింది. అనంతరం విజయవాడలో ఏడాది లాంగ్‌టర్మ్‌ శిక్షణ తీసుకుని నీట్‌లో ర్యాంకు సాధించింది. విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం పీజీకి సిద్ధమవుతోంది. గైనిక్‌ లేదా జనరల్‌ మెడిసిన్‌లో సీటు సాధించాలనేది ఆమె లక్ష్యం.

అక్క స్ఫూర్తితో ముందడుగు : అక్క స్ఫూర్తితో చిన్నక్క మాధురి వైద్య వృత్తి చేపట్టాలనే లక్ష్యాన్ని ఎంచుకుంది. అక్కలాగే హైదరాబద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చేరింది. అక్కడ చదివే సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తినా ఎలాంటి పట్టువదల్లేదు. తర్వాత ఏడాది పాటు లాంట్‌టర్మ్‌ శిక్షణ తీసుకుని మంచి ర్యాంకు సాధించింది. కన్వీనర్‌ కోటాలో కరీంనగర్‌లో ఉన్న చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ప్రస్తుతం ఆమె నాలుగో సంవత్సరం చదువుతోంది.

వచ్చిన సీటును వదులుకుంది : అక్కలు ఇచ్చిన ప్రోత్సాహంతో రోహిణి, రోషిణి సైతం వైద్య విద్యనే ఎంచుకోవాలనుకున్నారు. విజయవాడలో ఇంటర్‌ పూర్తిచేశారు. గత ఏడు నీట్‌ రాయగా రోహిణికి ప్రైవేటు వైద్య కళాశాలలో సీటు వచ్చింది. కానీ రోషిణికి సీటు రాలేదు. ప్రైవేటు కళాశాలలో చేరితే ఫీజుల భారం ఎక్కువవుతుందనే భయం, అలాగే చెల్లికి సీటు రాలేదనే బాధతో రోహిణి వచ్చిన సీటును వదులుకుంది. మరింత కష్టపడి చదివి ఈ ఏడు మళ్లీ నీట్‌ రాశారు. ప్రస్తుతం ఇద్దరు అమ్మయిలూ జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందారు. చదువు, క్రమశిక్షణలో ముగ్గురుకి అక్క మమత మార్గదర్శకంగా, ఆదర్శంగా నిలిచారని వారు వివరించారు.

‘నాన్నే’ మా హీరో : 'ఒకసారి మా దగ్గరి బంధువు ఒకాయన ‘డబ్బు ఉన్న వారికే వైద్య విద్యను అభ్యసించడం సాధ్యం కావడం లేదు. మీ వల్ల అవుతుందా’ అంటూ చేసిన ఆయన చేసిన వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయని, అలా ఎంతో మంది అన్న మాటలు తమలో కసి పెంచాయని ఆ నలుగురు అమ్మాయిలు తెలిపారు. ‘కొందరైతే ఆడపిల్లలకు పెద్ద చదువులు అవసరమా, పెళ్లి చేసి బాధ్యత తీర్చుకో' అంటూ అమ్మానాన్నకు ఉచిత సలహాలు ఇచ్చేవారని వివరించారు. మరికొందరు బంధువులు మమ్మల్ని కించపరిచేలా మాట్లాడేవారు. చాలా బాధపడ్డాం. అప్పుడే మాలో మరింత పట్టుదల పెరిగిందని తెలిపారు. మా విజయానికి అదే నాంది అయిందేమో అనిపిస్తుందని తెలిపారు.

'అమ్మానాన్నలూ వారి మాటలను పట్టించుకోరు. పైగా మాలో స్ఫూర్తిని రగిలించారు. ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని ప్రేరణ కల్పించారు. ఆ ప్రోత్సాహమే నాన్న లక్ష్యాన్ని నెరవేర్చాలనే మా ఆశయానికి అణువణువునా మరింత ఆయువు పోసింది. కష్టపడుతూనే ఇష్టంగా మమ్మల్ని పెంచిన మా నాన్నే మాకు రియల్‌ హీరో. రాత్రింబవళ్లు శ్రమిస్తున్నా నీరసించకుండా, ఓర్పుతో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న అమ్మే మాకు దైవం’ అని ఆ నలుగురు అమ్మాయిలు వివరించారు.

తోడ్పాటు అందిస్తే మరింత సులువు : నలుగురినీ చదివించేందుకు అమ్మానాన్నలకు ఏటా రూ.6 లక్షల వరకు ఖర్చవుతోందని నలుగురు సరస్వతీ పుత్రికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మొత్తాన్ని సమకూర్చేందుకు నాన్న ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎవరైనా ఆర్థిక సహకారం, తోడ్పాటు అందిస్తే సులువుగా లక్ష్యాన్ని చేరుతామని, సమాజానికీ అండగా నిలుస్తామని వెల్లడించారు. అమ్మాయిలను ఎవరూ, ఎప్పుడూ చులకనగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు.

'అద్వితీయ 2024' - సందడి చేసిన విద్యార్థినులు - వివిధ రంగాల్లో నైపుణ్య ప్రదర్శన

'ఈ స్థాయిలో ఉండడానికి హార్డ్​వర్క్​, తల్లిదండ్రులే కారణం - ఒలింపిక్స్​లో పతకమే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details