YSRCP Government Careless on Dhyana Buddha Project : ఎంత కోపంలో ఉన్నా గౌతమ బుద్ధుడి రూపం మదిలో మెదిలితే ప్రశాంతత చేకూరుతుంది. కానీ, అమరావతికి ఐకాన్‌గా మారిన ధ్యానబుద్ధుడిని చూస్తే జాలి కలుగుతోంది. రంగులు వెలిసిపోయి, గార్డెన్ ఎండిపోయి, లైట్లు ఊడిపోయి, గ్యాలరీల పెచ్చులూడిపోయి ఒకటా రెండా ఇలా ఎంచుకుంటూపోతే ధ్యాన బుద్ధుడికే కోపం కట్టలు తెంచుకునేలా ఉంది. ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడిన అమరావతి ధ్యానబుద్ధ ప్రాజెక్ట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంటోంది.
125 అడుగుల బుద్ధుని ప్రతిమ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు చెప్పగానే కళ్ల ముందు మెదిలేది 125 అడుగుల గౌతమ బుద్ధుడి విగ్రహమే. వేల ఏళ్ల క్రితం సిద్ధార్ధుడు నడయాడిన నేలగా ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉంది. దానికి గుర్తుగానే 2003లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం 125 అడుగుల ఎత్తైన బుద్ధుని ప్రతిమతో ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ప్రాథమికంగా పనులూ చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. 2006లో కాలచక్ర పేరిట ఇక్కడ అంతర్జాతీయ బౌద్ధ సమావేశం జరగడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.
జనవరి నుంచి రాజధాని పనులు - డిజైన్లలో నో ఛేెంజ్: మంత్రి నారాయణ
ధ్యానబుద్ధ ప్రాజక్ట్‌పై నిర్లక్షం : రాష్ట్ర విభజన తర్వాత 2014లో రాజధానికి అమరావతిగా నామకరణం చేసిన చంద్రబాబు అక్కడున్న ధ్యానబుద్ధ ప్రాజెక్ట్‌ను మరింత అందంగా తీర్చిదిద్దారు. బుద్ధుని బొమ్మ, దాని కింద మూడు గ్యాలరీల్ని అందంగా తీర్చిదిద్దారు. అమరావతి శిల్పాలు, బుద్ధుని జీవిత చరిత్ర విశేషాలను చాటే శిల్పాలకు మరిన్ని సొబగులద్దించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ అమరావతితో పాటే ధ్యానబుద్ధ ప్రాజక్ట్‌నూ పాడుబెట్టింది.
ధ్యానబుద్ధ విగ్రహానికి అక్కడక్కడా పగుళ్లు కనిపిస్తున్నాయి. రంగులు వెలిసిపోయాయి. భారీ ప్రతిమ కింద ఉన్న మూడు అంతస్తుల గ్యాలరీ సైతం పెచ్చులూడుతోంది. ధ్యానబుద్ధ ప్రాజెక్టు చుట్టూ ఉన్న గోడ వెంట ఉండాల్సిన చిన్న చిన్న ప్రతిమలు ఊరి చివర ఉన్న పాడుబడిన వసతిగృహంలో పడేశారు. అలంకరణ కోసం అమర్చిన విద్యుత్ లైట్లూ విరిగాయి. ఎటుచూసినా గత ఐదేళ్ల నిర్లక్ష్యానికి ఆనవాళ్లే కనిపిస్తున్నాయి.
రాజధాని నిర్మాణం కోసం సాంకేతిక సమస్యలన్నీ పరిష్కరించాం: మంత్రి నారాయణ
పూర్వవైభవం తేవాలంటున్న స్థానికులు : పంచారామాల్లో ఒకటైన అమరావతికి కార్తీక మాసంలో భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. అలా వచ్చిన వారు గతంలో ధ్యానబుద్ధ ప్రాజెక్టునూ సందర్శించేవారు. వైఎస్సార్సీపీ హయాంలో కనీస నిర్వహణ చేయకపోవడం వల్ల ఇప్పుడా పరిస్థితే కనిపించడం లేదు. సందర్శకులకు తాగునీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక వసతులూ లేవు. ఉద్యానవనంలో చిన్నారుల కోసం ఆట వస్తువులు, ఇతర క్రీడా సామగ్రి పాడైపోయింది. అమరావతి నిర్మాణంతో పాటే ధ్యాన బుద్ధ ప్రాజెక్టుకూ పూర్వవైభవం తేవాలని స్థానికులు కోరుతున్నారు.
అమరావతి ఐకానిక్ నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు - డిజైన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం