Rushikonda Cottages Demolition Inquiry : ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థలో కొందరు ఉన్నతాధికారులు గత వైఎస్సార్సీపీ సర్కార్‌పై ఇంకా కృతజ్ఞత చాటుకుంటూనే ఉన్నారు. అప్పట్లో జరిగిన ఘోర తప్పిదాలు బయటకు రాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అప్పటి ప్రభుత్వంలో జరిగిన కొన్ని అక్రమాలపై అదే ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పని చేసిన అధికారులకే విచారణ బాధ్యత అప్పగించడమే ఇందుకు నిదర్శనం.
విశాఖలో పలు పర్యాటక ప్రాజెక్టులను వైఎస్సార్సీపీ సర్కార్ కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టిందన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాక రుషికొండపై కాటేజీలు కూల్చేసినపుడు అందులోని రూ.కోట్ల విలువైన మంచాలు, సోఫాలు, ఏసీలు, డైనింగ్ టేబుళ్లు వంటివి అప్పటి అధికారులు కొందరు మాయం చేశారనేది ఫిర్యాదు. వీటిపై నిబద్ధత కలిగి ఎలాంటి అభియోగాలు లేని అధికారులతో విచారణ చేయించాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అప్పటి ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రి రోజా వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పని చేసిన రాజారాం మనోహర్‌కు విచారణ బాధ్యత అప్పగించడం విశేషం.
Rishikonda Resorts Demolition Issue : రాష్ట్ర ఆడిట్‌శాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న రాజారాం మనోహర్ ఎన్నికలకు ముందువరకూ మంత్రి రోజా వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహించారు. ఎన్నికల నియమావళి ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు డిప్యుటేషన్‌పై ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు వచ్చారు. ఇక్కడ కూడా కీలకమైన విజిలెన్స్, మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్‌గా ఆయనను అప్పట్లో నియమించారు. విశాఖలో ప్రాజెక్టులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన అంశంపై రాజారాంతో విచారణ జరిపించాలని ఇటీవల ఉన్నతాధికారులు నిర్ణయించారు.