Sand Mining on Perni Nani Godown : రేషన్ బియ్యం మాయం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైఎస్సార్సీపీ నేత పేర్నినానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. రేషన్ బియ్యం నిల్వ కోసం లీజుకిచ్చిన గోదాము స్థలం మెరకకోసం అక్రమంగా బుసక తరలించినట్లు గనులశాఖకు ఫిర్యాదు అందింది. ఎంత తరలించుకెళ్లారో లెక్కలు వేసి జరిమానాతోపాటు క్రిమినల్ కేసులు పెట్టేందుకు గనులశాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. మరోవైపు బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య గడువులోగా పౌరసరఫరాల శాఖకు జరిమానా చెల్లించలేదు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా అడిగేవారు లేరన్నట్లు అడ్డగోలుగా చెలరేగిన మాజీ మంత్రి పేర్నినాని ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా నాడు అధికారిన్ని అడ్డుపెట్టుకుని నిర్మించిన గోదాములే ఆయన్ను చిక్కుల్లోకి నెడుతున్నాయి. మచిలీపట్నం పరిధిలోని పొట్లపాలెంలో పేర్ని కుటుంబం దాదాపు ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూములు కొనుగోలు చేసి 6 ఎకరాల విస్తీర్ణంలో 2 గోదాములు నిర్మించింది. ఐతే నిర్మాణ పనుల్లో భాగంగా స్థలాన్ని మెరక చేసేందుకు సమీపంలోని బుసకను తరలించారు. కానీ దానికి ఎలాంటి రాయల్టీ చెల్లించలేదని కృష్ణా జిల్లా గనుల శాఖతోపాటు, విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు అసిస్టెంట్ జియాలజిస్టు గోదాముల వద్దకు తన బృందంతో కలిసివెళ్లారు. గేట్లకు తాళం వేసి ఉంది. బుసక తరలింపువిషయంలో గోదాముల యాజమాజ్యానికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
బియ్యం దందా పేర్ని పన్నాగమే - రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
గోదాముల నిర్మాణ స్థలం చదును కోసం ఎంత మేర బుసక తరలించారనేది గనులశాఖ అధికారులు లెక్కగట్టే పనిలో ఉన్నారు. గనుల శాఖలో ఖనిజాల కింద బుసక లేదు. దీన్ని ఇసుకగానే పరిగణిస్తారు. ఏడెకరాలు చదును చేసి మెరక చేసేందుకు దాదాపు 94వేల క్యూబిక్ మీటర్ల బుసక వినియోగించారని అంచనా వేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో టన్ను ఇసుకపై రాయల్టీ దాదాపు 60 రూపాయలుగా ఉంది. ఏ ఖనిజమైనా అక్రమంగా తవ్వితే దానికి పది రెట్ల జరిమానా వేస్తారు. ఒక ట్రాక్టర్ ఇసుక అక్రమంగా తవ్వితే 2వేల రూపాయల జరిమానా విధిస్తారు.