KCR on BRS Future Plan : కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమవుతున్న తెలంగాణను అక్కున చేర్చుకుని, తిరిగి గాడిలో పెట్టే దాకా తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత గురువారం సమావేశమయ్యారు. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలు ఎలా గద్దె మీద కూర్చోబెట్టారో, అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ను ప్రజలు తిరిగి ఆదరిస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
గతంలో కంటే రెట్టింపు మద్దతుతో అధికారం ఇచ్చే రోజు త్వరలోనే వస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్ల అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామని, ఇలాంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని వాపోయారు. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని, చరిత్రలోకి వెళ్తే అర్థం అవుతుందని అన్నారు.
హామీలతో ఆగమాగం : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలు నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారన్న ఆయన, పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లు అయిందని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు అందడం లేదని, తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా కావడం లేదని, ఇవన్నీ ప్రజల మనసుల్లో నమోదు అవుతున్నాయని కేసీఆర్ చెప్పారు.