Vijay Paul Situation in Jail: సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ పొందినా అందులోనే ఓఎస్డీ పోస్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయనకు కట్టబెట్టింది. అదే అదనుగా అప్పటి అధికార పెద్దల అండదండలతో కన్నూమిన్ను కానరాకుండా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. తనకు సముచిత స్థానమిచ్చిన వారికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని సహించలేకపోయారు. చట్టాలను తుంగలో తొక్కి, నాటి అధికార పార్టీ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేశారు. తమ అధినేతల కళ్లలో ఆనందం చూడటానికి ఇష్టానుసారం చెలరేగిపోయారు. తీరా అధికారం మారిన తర్వాత కేసులో చిక్కుకుని చివరికి జైలు‘పాల్’ అయ్యారు.
నిందితుడిగా మారి:ఎస్సై, సీఐ, డీఎస్పీగా మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులో ఎన్నో వేల కేసులు రికార్డు చేసి ఉంటారు రావెల విజయ్‌పాల్. అంతకుమించిన సంఖ్యలో నేరగాళ్లను విచారించి ఉంటారు. గత వైఎస్సార్సీపీ పాలనలో సీఐడీ విభాగం అదనపు ఎస్పీగా, ఓఎస్డీగా ఎంతోమందిని వివిధ కేసుల్లో అరెస్టు చేశారు. చివరికి అప్పటి అధికార వైఎస్సార్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలోనూ తాడేపల్లి ప్యాలెస్ ఎలాచెప్తే అలా చేశారు. రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో ప్రస్తుతం తానే నిందితుడిగా మారారు. సీఐడీ ఏఎస్పీగా రఘురామపై నమోదైన కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే కేసులో తాను ఇరుక్కుని నిందితుడిగా పోలీసు స్టేషన్‌లో చాపపై పడుకోవాల్సిన దుస్థితిని తెచ్చుకున్నారు.
గుండెపోటుతో మరణించేలా కుట్ర - విజయ్‌పాల్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు