Former CID ASP Vijay Paul Arrested: మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆర్. విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌పాల్ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు, రాత్రి 9 గంటల సమయంలో విజయ్‌పాల్‌ని అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మంగళవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
రాత్రికి స్టేషన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు:ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు సుదీర్ఘంగా విజయ్‌పాల్‌ను విచారించారు. అనంతరం విజయ్‌పాల్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ఈ మేరకు విజయ్‍పాల్ రిమాండ్ రిపోర్టును పోలీసులు సిద్ధం చేశారు. విజయపాల్‌ను రాత్రికి ఒంగోలు పోలీస్ స్టేషన్లోనే ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్‌పాల్‌ను బుధవారం ఉదయం గుంటూరు తరలించనున్నారు.
ఇదీ జరిగింది:2021లో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ రీజనల్ ఆఫీస్‌కి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది జులై 11వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.