Officers Found Old Woman Who Missed in Forest :మేకలు మేపడానికి వెళ్లిన ఓ వృద్ధురాలు అడవిలో తప్పిపోయి వారం రోజుల తర్వాత ఇంటికి క్షేమంగా చేరుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం, మహబూబ్‌నగర్ పురపాలిక పరిధి అప్పన్నపల్లికి చెందిన చంద్రమ్మ (71) రోజూ మయూరి పార్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలు మేపడానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేవారు. గత నెల 30న కూడా తమ ఏడు మేకలతో అడవికి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినా, చంద్రమ్మ మాత్రం రాలేదు. దీంతో అందోళనకు గురైన కుటుంబ సభ్యులు, ఆదే రోజు రాత్రి మహబూబ్‌నగర్ గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో చంద్రమ్మ కోసం ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్థులు కలిసి అటవీ ప్రాంతంలో గాలించినా, పట్టణంలోని కల్లు కంపౌండ్లలో వెతికినా ఆమె అచూకీ లభించలేదు. మయూరి పార్కు సమీపంలో అక్కడకక్కడ అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నాయి. వృద్ధురాలు అడవిలో తప్పిపోయిన విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు కూడా పలు కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. సిబ్బందిగా ఏర్పడి అటవీ ప్రాంతంలో నాలుగు రోజుల పాటు గాలింపులు చేపట్టినా ఆమె దొరకలేదు. ఎట్టకేలకు డిసెంబర్ 5న గోల్ బంగ్లా (వాచ్ టవర్) ప్రాంతంలో వృద్ధురాలు ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యం ద్వారా గుర్తించారు.
దొరక్కపోవటంతో ఆశలు వదులుకున్నాం : అదే రోజు అటవీ శాఖ అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు గోల్‌బంగ్లా ప్రాంతంలో రాత్రి వరకు వెతికినా ఆమె కనిపించలేదు. మళ్లీ ఈ నెల 6న కుటుంబసభ్యులు, అటవీ శాఖ అధికారులు వృద్ధురాలి కోసం అటవీ ప్రాంతంలో వెతకడం ప్రారంభించగా నడవటం కూడా చేతకాక ఓ చెట్టును పట్టుకుని దయనీయ స్థితిలో కనిపించింది చంద్రమ్మ. దీంతో కుటుంబసభ్యులు వృద్ధురాలిని ఇంటికి చేర్చారు. ఆశలు వదులుకున్న వేళ ప్రాణాలతో ఇంటికి చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారం రోజులైనా తమ అమ్మ దొరకకపోవటంతో ఇక ఆశలు వదులుకున్నామని, గాలింపు చర్యలు చేపట్టి ఆచూకీ గుర్తించిన అటవీ శాఖ అధికారులు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చంద్రమ్మ కుమారుడు సుధాకర్ అన్నారు.