Food wastage In India :కూడు, గూడు, గుడ్డ మనిషి జీవనానికి కనీస అవసరాలు. ముఖ్యంగా కూడు ఉంటేనే గూడు గుడ్డను సంపాదించుకోగలం. మరోలా చెప్పాలంటే కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు. ప్రపంచంలోని ప్రతీ జీవి ఆహారం కోసమే నిత్యం శ్రమిస్తుంది. కానీ, కనీసం ఆహారం దొరక్కా కోట్లాదిమంది అలమటిస్తుంటే మరోవైపు కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్న దుస్థితి నెలకొంది. ప్రపంచ ఆహార సూచీ-2024 నివేదిక ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి చెందిన ఆహార వృథా సూచీ దీనికి సంబంధించి అనేక గణాంకాలతో నివేదిక విడుదల చేసింది.
UN Report On Food Wastage :ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా 2021లో ఉత్పత్తైన ఆహారంలో 19% వృథా అయినట్లు నివేదిక తెలిపింది. దీని పరిమాణం 105 కోట్ల టన్నులుగా లెక్కగట్టింది. ప్రతి మనిషి ప్రతి ఏటా 79కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్ల భోజనాలకు సమానం అని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. 2019లో 17% ఉన్న ఆహార వృథా 2021కి వచ్చేసరికి 2% పెరిగి 19శాతాని కి చేరినట్లు తెలిపింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆహార వృథా 60% గృహాల్లో జరుగుతుండగా, హోటళ్లు, ఇతర ఆహార సేవా సంస్థల్లో 28% ఉన్నట్లు తేలింది. మిగిలిన 12% ఇతర కారణాల వల్ల జరుగుతున్నట్లు తెలిసింది. ఆహార వృథాను అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామంటూ అనేక దేశాలు గొప్పలు చెబుతున్న వేళ తాజా గణాంకాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి.
Causes Of Food Wastage :ఆహార వృథాకు ప్రజల సామాజిక అలవాట్లు కూడా కారణం అనే వాదన ఉంది. వివాహాలు, ఇతర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే విందు భోజనాల ఏర్పాట్లలో తీవ్ర ఆహార వృథా జరుగుతోంది. వేడుకలు ఎలా నిర్వహించుకోవాలి అన్నది వ్యక్తిగత విషయమే ఐనా ఈ సందర్భంగా జరుగుతున్న వృథాయే కలవరపెడుతోంది. విందు సందర్భంగా హోదాను చాటుకునేందుకు లెక్కలేనన్ని పదార్థాలను వండి వడ్డించడం, అన్ని పదార్థాలను తినలేక అతిథులు అలాగే వదిలేస్తున్న ఉదాహరణలు లెక్కకు మిక్కిలి. అతిథులు తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు చెత్త కుండీల పాలవుతోంది. అలా మిగిలిన ఆహార పదార్థాలను కొందరు పేదలు, స్వచ్ఛంద సంస్థలు, ఫుడ్ బ్యాంకులకు అందిస్తున్నా ఎక్కువ శాతం వృథాగానే పోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఇలాగే జరుగుతోంది.
ఆహార నష్టమూ అధికమే: ఆహార వృథా పరిస్థితి ఇలా ఉంటే ఆహార నష్టం కూడా అధికంగానే ఉంది. పంట కోతల తర్వాత, చిల్లర విపణి స్థాయిలో ఆహారం వినియోగానికి పనికి రాకుండా పోవడాన్ని ఆహార నష్టంగా అభివర్ణిస్తారు. కాగా ఆహార వృథాను వృథాగానే చూడకుండా దానికి ఓ రైతు పడే కష్టాన్ని లెక్కగడితే దాని విలువను తెలుసుకోవచ్చు. దుక్కి దున్ని, నీరు పెట్టి, నారు పోసి ఆరుగాలం శ్రమించే అన్నదాత కష్టానికి ఫలితమే ఆహార లభ్యత. కానీ, ఆ ఆహార ధాన్యాలు పంటపొలం నుంచి మార్కెట్‌లోకి వచ్చే క్రమంలోనూ అధికంగా నష్టం జరుగుతోంది.
వృథా అవుతున్న రైతుల కష్టం :లక్షల టన్నుల మేర ఆహారం వృథా కావడం వల్ల ఆ మేరకు పంటలు పండించడానికి ఉపయోగించిన నీరు, పెట్టుబడి ఖర్చులు, ఎరువులు, రైతుల కష్టం వృథా అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహార పదార్థాలు సుమారు 30% సాగు భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులతో సమానమని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ లాంటి దేశాల్లో ఆహార వృథాను లెక్కించడానికి ట్రాకింగ్ వ్యవస్థలు సరిగ్గా లేవు. ఆస్ట్రేలియా, జపాన్, యూకే, అమెరికా, కెనడా, సౌదీ అరేబియాలు ఇందుకు సరైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి.
ఆహార సరఫరాలో వృథా వల్ల భారత్‌లో లక్ష కోట్ల నష్టం :ఆహార సరఫరాలో నష్టాలు, వృథా వల్ల ప్రపంచానికి సుమారు 83 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు ఐరాస నివేదించింది. భారత్‌లో ఈ నష్టం దాదాపు లక్ష కోట్ల రూపాయలని అంచనా. ఆహార వృథా వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. ఆహార వ్యర్థాలను డంపింగ్ యార్డులు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. అవి కుళ్ళిపోయే క్రమంలో ప్రమాదకర మైన ఉద్గారాలు వాతావరణంలోకి వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలవు తున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో 10% వరకు కుళ్ళిన ఆహారం నుంచే వస్తున్నట్లు అంచనా.