Anitha Visits Flood Affected Areas in Vijayawada : విజయవాడలో భారీ వర్షాలకు హోం మంత్రి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి పంపించారు. రామవరప్పాడు వంతెన కింద ఆమె ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. ఆదివారం నుంచి అనిత నివాసం వరద ముంపులోనే ఉంది. అయినా ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
మరోవైపు విపత్తు నిర్వహణ బృందం అనిత ఇంటి వద్దకు చేరుకుంది. కానీ ఆమె తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తన ఇంటి కోసం వచ్చిన సహాయక బృందాన్ని సింగ్‌నగర్ వైపు పంపించారు.
Vijayawada Floods Updates :ఆదివారం ఉదయం బుడమేరు కట్ట తెగిపోవటంతో ఒక్కసారిగా వరద నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తిందని హోంమంత్రి అనిత తెలిపారు. నగరంలోని 8 డివిజన్లతో పాటు గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు పరిధిలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద తాకిడికి గురయ్యాయన్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల పరిధిలో 24 కాలనీలు 70 సచివాలయాలు ఉన్నాయని చెప్పారు. ప్రతీ సచివాలయం పరిధిలో ఒక ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించామని అనిత వెల్లడించారు.