Flood Victims Problems In Khammam :ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ధాటికి బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ప్రధానంగా దానవాయిగూడెం, రాజీవ్ గృహకల్ప, సాయికృష్ణ నగర్, పెద్దతండా, నాయుడుపేట, పలు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లో విలువైన సామాగ్రి కొట్టుకుపోవడమే కాకుండా ఇళ్లల్లో ఉన్న విలువైన ధ్రువపత్రాలు వరద పాలై బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బ్యాంకు పుస్తకాలు, ఏటీఎం కార్డులు, రేషన్ సరుకులకు వెళ్దామంటే రేషన్ కార్డులు, గ్యాస్ బండ తెచ్చుకుందామంటే గ్యాస్ పుస్తకాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు.
వివరాలు సేకరిస్తున్న జిల్లా యంత్రాంగం :వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే చదువులకు సంబంధించిన వివిధ రకాల సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థుల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది రెవెన్యూ ప్రాంతాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి తిరుగుతూ కుటుంబ వివరాలు, కోల్పోయిన ధ్రువీకరణ పత్రాలు, దస్త్రాల వివరాలు సేకరిస్తున్నారు.
"వరదల్లో మాకు సంబంధించిన విలువైన సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, గ్యాస్, బ్యాంకు పాస్బుక్లు వరదనీటిలో తడిచిపోయాయి. సకలం కోల్పోయాము. ఎల్ఐసీ బాండ్లు కాగితాలు పోయాయి. పిల్లల సర్టిఫికెట్లు కూడా పోయాయి. ఇంట్లోకి వరదనీరు చేరి అన్ని తడిచిముద్దయ్యాయి"- వరదబాధితులు, ఖమ్మం