Fire Accident at Visakhapatnam Railway Station: విశాఖ రైల్వేస్టేషన్‌లో నిలిపి ఉంచిన కోర్బా ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు ఎగసిపడడం తీవ్ర అలజడి సృష్టించింది. కోర్బా నుంచి వచ్చిన రైలును ఆదివారం ఉదయం నాలుగో నంబరు ప్లాట్ ఫారంపై నిలిపి ఉంచారు. 9 గంటల 20 నిమిషాలకు రైల్లోని B-7 బోగీలో మంటలను గుర్తించారు. వెంటనే మంటలు B-6, M-1 బోగీలకు వ్యాపించాయి. అగ్ని కీలల ధాటికి B-6, B-7, M1 బోగీలు దగ్ధమయ్యాయి. సీట్లన్నీ కాలి బూడిదయ్యాయి.
రైల్లో మంటలను గుర్తించిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 4 యంత్రాలతో బోగీలపై నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. స్టేషన్లో ఉన్న ప్రయాణికులను ఘటనా స్థలి నుంచి దూరంగా తరలించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని రైల్వే సిబ్బంది భావిస్తున్నారు.
ప్రమాద సమయంలో రైల్లో ఎవరూ లేనందున ప్రాణనష్టం సంభవించలేదని విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉదయాన్నే వచ్చిన ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారని, ఆ తర్వాతే ప్రమాదం జరిగిందన్నారు. మంటలను గుర్తించిన వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిపారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసినట్లు చెప్పారు.
అగ్నిమాపక సిబ్బంది సమర్థంగా పనిచేసి గంటన్నరలోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని విశాఖ సహాయ అగ్నిమాపకశాఖ అధికారి సింహాచలం తెలిపారు. రైల్లో ఇన్ ఫ్లేమబుల్ మెటీరియల్ ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తించినట్లు చెప్పారు. కోర్బా ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై విచారణ జరపాలని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. డీఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన తర్వాత రైల్వే బోగీలను మార్చి గమ్యస్థానానికి పంపినట్లు అధికారులు తెలిపారు.