Financial lessons for children:పిల్లలకు ఆర్థిక పాఠాలు అనేవి వారి బంగారు భవితకు మంచి సోపానాలు. చాలా మంది పిల్లలకు డబ్బు విలువ తెలియదు. అందుకే చూసినవన్నీ కావాలంటారు. ఏది చూసినా కొనాలని మారాం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇతరులతో, స్నేహితులతో పోల్చుకుని 'వాళ్ల దగ్గర ఉంది మనం ఎందుకు కొనకూడద'ని ఇతరులతో పోలిక చెప్తుంటారు. అలాంటి వారికి డబ్బు విలువని తెలియజేస్తూ పొదుపుని అలవాటు చేస్తే మారిపోయే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లాడి వృషణాలు చిన్నగా ఉన్నాయా? - మలబద్ధకం సమస్యా?
చిన్నప్పుడు తల్లిదండ్రులు చేతికి డబ్బులు ఇచ్చి కిరాణా దుకాణానికి పంపించేవారు. అలాంటపుడు వస్తువులు తీసుకున్నాక మిగిలిన చిల్లరను దాచుకునేవాళ్లం. వాటిని ఒకటికి రెండు సార్లు లెక్కపెట్టుకుని డబ్బాలో వేసుకుని తరచూ చెక్ చేసుకునేవాళ్లం. అప్పట్లో పెద్దలు నేర్పిన ప్రాథమిక ఆర్థిక పాఠాలు ఇవే. కానీ, నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు ఆ అనుభవం రాకపోడం పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు. అలాగని వదిలేయకుండా డబ్బు విలువని వారికి వివరించి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. పిల్లలకు డబ్బు విలువ తెలియాలంటే పాకెట్‌మనీ ఇవ్వాలి. ఉదాహరణకు నెలకు రూ.100 నుంచి 200 ఇచ్చి 'దీంతో ఏం చేయాలనుకుంటున్నావ్?' అని అడగండి. వారికి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం, అవసరాలూ, కోరికల్ని గుర్తించడం అప్పుడే తెలియడంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం పొదుపుచేయడం అలవాటవుతుంది.
మూడు నెలలు, ఆరు నెలలు ఎంత పొదుపు చేస్తారో చూడండి అని పోటీ పెట్టండి. అది వారి లక్ష్యాలను మెరుగుపరుస్తుంది. ఆర్థిక నిర్వహణను సరదాగా నేర్చుకునేందుకు ఎంతో ఉపకరిస్తాయి. కుటుంబ ఆర్థికచర్చల్లోనూ పిల్లల్ని భాగం చేయండం ద్వారా వారికి డబ్బు విలువ తెలిసే అవకాశాలున్నాయి. ఏదైనా మనం కొనలేం అని చెప్పకుండా, దానికి ఎంత ఖర్చవుతుందో, ఎంతగా కష్టపడాల్సి ఉంటుందో, కొనడానికి కుటుంబ సభ్యులంతా ఎలా పొదుపు చేయాలో చర్చించండి. దీనివల్ల పిల్లలకూ ఆర్థిక విషయాలపై అవగాహన, ప్రణాళిక, ఆలోచనలూ తెలుస్తాయి. స్నేహితుల్లో అందరూ ఒకేలా ఉండరు. బాగా డబ్బున్న ధనిక కుటుంబాల పిల్లల విషయంలో వారిని ఎలా చూడాలో పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. డబ్బున్నవారు సమాజహితం కోసం చేస్తున్న పనుల గురించి ఉదాహరణలతో వివరించండి. అలా చేయడం వల్ల వస్తువులకే కాదు, సేవకూ డబ్బు ఓ మంచి మార్గమని పిల్లలు అర్థం చేసుకునే వీలుంది.