Hema Arrested in Bangalore Rave Party Case :సంచలనంగా మారినబెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం దర్యాప్తు చేపట్టిన కోర్,టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. రేవుపార్టీ కేసులో ఆమె తనపై వచ్చిన ఆరోపణలకు తగిన సమాధానం చెప్పలేదని, అలాగే తాను డ్రగ్స్ తీసుకోలేదని వీడియో తీసి పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గత నెలలో కర్ణాటక బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని అక్కడి పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నటి హేమను తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. మే 27న రావాలని తొలుత నోటీసులు ఇవ్వగా, తనకు జ్వరం కారణంగా రాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలంటూ ఆమె కోరారు. దాంతో జూన్ 1న విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. అప్పుడూ డుమ్మా కొట్టడంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి, విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.
ఇదీ అసలు విషయం : బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ కూడా దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.