Four Died in Road Accident At Gummadidala :అతి వేగం ప్రమాదకరమే అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆటోల మధ్య ఛేజింగ్ నలుగురిని విగత జీవులుగా మార్చింది. ప్రభుత్వ ఏఈ అధికారిణిగా ఇటీవలే ఉద్యోగం పొందిన యువతి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఐఏఎస్ అవ్వాలని కలలు కన్న ఆ అమ్మాయి జీవితం ఒక్క క్షణంలో ఆగిపోయింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జరిగిన ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన సంతోష్ షేర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే అతను ఆటో నడుపుతున్నాడు. షాపూర్ నుంచి నర్సాపూర్ వైపు షేర్ ఆటోలో వెళ్తున్నాడు. ఆయన ఆటోలో మనిషా, అనసూయ, ఐశ్వర్యతో పాటు మరో యువకుడు ఎక్కాడు. ఆటో షాపూర్ దాటగానే స్పీడ్ పెంచాడు. శుక్రవారం సంత కావడంతో నర్సాపూర్‌కు చెందిన వడ్డె రాజు ఆటోలో ప్రవీణ్‌తో కలిసి కూరగాయలు తీసుకుని అదే రహదారిలో వెళ్తున్నారు.
కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లిన లారీ - నలుగురి మృతి
క్షణంలో మారిపోయిన సీన్ : ఈ రెండు ఆటోలు ముందుగా వెళ్లాలని ఛేజింగ్ చేశాయి. నేనంటే నేను ముందు వెళ్లాలి అన్న మాదిరిగా ఆటోలు నడిపించారు. ఒకదాన్ని మరొకటి దాటడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారు, ఢీ కొట్టడంతో రెండు ఆటోలు చెరోపక్క పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా, అనసూయ అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్ సంతోష్‌కు తీవ్ర గాయలయ్యాయి. ప్రమాదంలో సంతోష్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను తరలించగా నరసాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహాయం అందించే విధంగా చూస్తామని అన్నారు.
నలుగురి ప్రాణాలను బలిగొన్న ఆటోల ఛేజింగ్ - మృతుల్లో ఇటీవలే ఉద్యోగం సాధించిన అసిస్టెంట్ ఇంజినీర్ (ETV Bharat) మృతుల వివరాలు :హైదరాబాద్‌కు చెందిన కవిత, వెంకట్‌రెడ్డిలకు ఇద్దరు కుమార్తెలు మనిషా, మాళవిక. మనిషాకు ఇటీవలే నర్సాపూర్ పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా ఉద్యోగం వచ్చింది. దీంతో తను సోదరి మాళవికతో కలిసి సంజయ్ గాంధీ నగర్లో నివాసముంటుంది. మనిషా రోజు మాదిరి ఆఫీస్‌కు ఆటోలో బయలుదేరగా ఉదయం జరిగిన ఘటనలో మృతి చెందింది. నర్సాపూర్ మండలం రుస్తుంపేటకు చెందిన దంపతులు అనిల్, మహేశ్వరిలకు కుమార్తె ఐశ్వర్య, కుమారుడు ఉన్నారు. ఐశ్వర్య ప్రస్తుతం ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీలో మూడో సంవత్సరం చదువుతోంది. కౌడిపల్లి మండలం చెందిన అనసూయ(62) వీరితో పాటు ఆటోలో ప్రయాణించారు. ప్రమాదంలో గాయపడ్డ అనసూయ చికిత్స పొందుతూ మరణించింది. యువకుడు మాలోతు ప్రవీణ్ (32)గా గుర్తించారు.
బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం - 38 మంది మృతి
యాదాద్రి జిల్లాలో చెరువులోకి దూసుకెళ్లిన కారు - ఐదుగురు యువకుల జల సమాధి