Female Constable Brutally Murdered by her Own Brother : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ శివారులో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. పోలీసుస్టేషన్‌కు బైక్‌పై వెళ్తుండగా ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోలు - మాన్యగూడ రహదారిలో వెనక నుంచి కారుతో ఢీకొట్టి అనంతరం కత్తులతో నరికి చంపారు. రాయపోలుకు చెందిన నాగమణి హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం జరగ్గా 10 నెలల క్రితమే భర్తతో విడాకులయ్యాయి.
తరువాత నెల రోజుల క్రితం యాదగిరిగుట్టలో మరో వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం హయత్‌నగర్‌లోనే నివాసం ఉంటున్న నాగమణి ఆదివారం సెలవు కావడంతో భర్తతో కలిసి సొంతగ్రామానికి వెళ్లారు. తిరిగి యథావిధిగా హయత్‌నగర్ స్టేషన్‌కు వస్తుండగా నాగమణిని వెంబడించి కారుతో ఢీకొట్టి హత్య చేశారు. సోదరి కులాంతరం వివాహన్ని తట్టుకోలేని ఆమె సోదరుడే పకడ్బందీగా ప్లాన్ చేసి, విధులకు వెళ్తుండగా కార్‌తో ఢీ కొట్టి, వేట కొడవలితో నరికి హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రాణహాని ఉందని చెప్పినా : నాగమణి మృతిపై భర్త శ్రీకాంత్ వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. గత ఎనిమిది సంవత్సరాలుగా తను, నాగమణి ప్రేమించుకుంటున్నామని తెలిపారు. తమ ప్రేమ విషయం నాగమణి ఇంట్లో తెలిసినప్పటి నుంచి వారు పట్టించుకోవడం మానేశారన్నారు. 2021లో నాగమణికి కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని తెలిపారు. అంతకుముందు నాలుగు సంవత్సరాలుగా తను హాస్టల్లోనే ఉందని చెప్పారు.