Feast with 100 Types of Dishes for Son-In-Law In Kakinada District:మర్యాద అంటే గోదారోళ్లు, గోదారోళ్లు అంటే మర్యాద. అసలు గోదారోళ్లు అంటే ఆతిథ్యానికి మారుపేరు. అందులోనూ ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. ఇక కొత్త అల్లుళ్లులకు తమ అత్త మామలు ఇచ్చే మర్యాదల గురించి అయితే చెప్పక్కర్లేదు. సామాన్యంగా అల్లుళ్లంటే మర్యాదలెక్కువ. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. ఇక సంక్రాంతి సమయాలు కాని ఏవైనా పండుగలకు గాని కొత్త అల్లుళ్లు ఇంటికి వస్తే ఆ హంగామా అంతా ఇంతా ఉండదు. రకరకాల పిండి వంటలు, కొత్త బట్టలు అవీ ఇవీ అని ఆ హడావుడే వేరు చెప్పక్కర్లేదు.
సహజంగా కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తగారు చేసే హడావుడి అంతా ఇంత కాదు. రకరకాల వంటలు చేసి అల్లుడిని ఎలా మెప్పించాలా? అని ఆరాట పడుతుంటారు. తమ కూతుర్ని అడిగి అల్లుడికి ఏమి ఇష్టమో తెలుసుకుని వాటిని వండి పెడతారు. ఇక్కడ ఓ దంపతులు కూడా తమ అల్లుడికి కలకాలం గుర్తుండిపోయేలా కొత్తగా ఏమైనా చేయాలనుకున్నారు. ఇంకేముంది రకరకాల వంటకాలతో కళ్లు చెదిరేలా విందు ఏర్పాటు చేశారు. ఇలానే కాకినాడ జిల్లాలో ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి తన కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు. ఆషాడం అనంతరం తొలిసారిగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్త మామలు 100 రకాల పిండి వంటలు రుచి చూపించారు. కొత్తగా వచ్చిన అల్లుడు అత్తింటివారి మర్యాదలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.