ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్ కళ్యాణ్​ని కలవాలని ఎడ్లబండిపై వచ్చిన రైతు - 28 రోజులు 760కి.మీ. ప్రయాణం - FARMER IN JANASENA OFFICE

రైతుల కష్టాలను పవన్‌కు చెప్పేందుకు ఎడ్లబండిపై చేరుకున్న యువ రైతు - మూడు రోజులుగా పడిగాపులు

YOUNG FARMER  BULLOCK CART YATRA
YOUNG FARMER REQUEST TO DEPUTY CM PAWAN KALYAN (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2024, 4:25 PM IST

Young Farmer Bullock Cart Yatra to Amaravati:దళారీ వ్యవస్థతో రైతులు నష్టపోతున్న తీరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​కు చెప్పాలని ఓ యువ రైతు నిర్ణయించుకున్నాడు. రైతులు సాగులో నష్టాన్ని ఎదుర్కోలేక బలవంతపు చావులకు పాల్పడుతున్న తీరుతో తీవ్ర ఆవేదన పడ్డాడు. ఒకరు, ఇద్దరు రైతులకైతే ఏదైనా సహాయపడవచ్చు కానీ రాష్ట్రంలో నష్టపోతున్న తోటి రైతులకు ఏదో ఒకటి చేయాలని తపించాడు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలపడానికి గతంలో ఏ రైతు చేయని ప్రయత్నం చేస్తూ తన సొంత గ్రామం నుంచి ఎడ్లబండిపైనే అమరావతికి వెళ్లి రైతుల కష్టాలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​కు చెప్పడానికి పయనమయ్యాడు. దాదాపు 28 రోజుల్లో 760 కిలోమీటర్లు ప్రయాణించి మొత్తానికి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నాడు.

పవన్‌ను కలిసేందుకు అనుమతించాలన్న యువ రైతు: శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన నవీన్ కుమార్ అనే యువ రైతు తమ కష్టాలను వివరించేందుకు మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుటే మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. అన్నదాతల సమస్యలను పవన్‌కు చెప్పేందుకు హిందూపురం నుంచి ఎడ్లబండిపై వచ్చినట్లు కార్యాలయ సిబ్బందికి తెలియజేశాడు. పవన్ కల్యాణ్ పిలుపు కోసం దాదాపు మూడు రోజులుగా మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుటే రైతు నవీన్ ఎదురుచూస్తున్నాడు. కార్యాలయం గేటు బయటే చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ ఇబ్బంది పడుతున్నాడు. చలి తీవ్రత కారణంగా తన ఎద్దులు సైతం అనారోగ్యానికి గురవ్వడం బాధాకరం. ఎడ్లకు తినడానికి గడ్డి కూడా లేదంటూ మేత ఇవ్వాల్సిందిగా చుట్టపక్కల రైతులను ప్రాధేయపడుతున్నాడు. రైతుల కష్టాలను వివరించేందుకు వ్యయప్రయాసలకోర్చి ఎంతో దూరం నుంచి వచ్చిన తనను ఉపముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని నవీన్ కార్యాలయ సిబ్బందిని అభ్యర్థిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details