Farmers Happy with Krishna Water in Handriniva Canals :ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా కాలువల్లో కృష్ణా జలాల సవ్వళ్లతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పొలం ముంగిటే నీరు ప్రవహిస్తున్నా చెరువుకు నింపుకొనే అవకాశం లేకుండా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని అన్ని చెరువులు నింపేందుకు ప్రణాళిక చేసింది. వరుణుడు సైతం కరుణించడంతో 50 శాతం పైగా చెరువులు పుష్కలంగా నిండాయి. అప్పట్లో ఓట్ల కోసం నీటి రాజకీయం చేసిన చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ ముఖ్యనేత అనంత రైతులకు అన్యాయం చేసి సాగు నీటిని తరలించుకుపోతున్నారని మొరపెట్టుకున్నా కనీసం స్పందించని పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జిల్లాలోని 214 చెరువులను కృష్ణా జలాలతో నింపడానికి అధికారులకు దిశానిర్దేశం చేసింది.
కృష్ణా జలాల సవ్వళ్లతో రైతుల్లో ఆనందం :ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుల సాగునీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. సాగునీటి రంగానికి అప్పటి జగన్ సర్కారు నిధులివ్వకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. వర్షాలు పుష్కలంగా కురిసినా పొలాలకు నీరివ్వడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కృష్ణా, తుంగభద్ర నీటిని ప్రణాళిక ప్రకారం కాలువలకు మళ్లిస్తూ ఎక్కడికక్కడ జలాశయాలు, చెరువులు నింపేలా అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు హంద్రీనీవా, హెచ్ఎల్సీ (HCL) కాలువలు గుండెకాయలాంటివి. ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా రైతులకు సాగు నీరందిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కాల్వలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం మళ్లీ అధికారంలో ఉండటంతో హంద్రీనీవా నీటితో చెరువులు నింపి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ప్రణాళిక చేసింది.
కరువు సీమలో కుండపోత - ఊళ్లను ముంచెత్తిన వరద - బుడమేరును తలపించిన పండమేరు