Farmers Facing Lack Of Irrigation Water Problem in Eluru District :ప్రకృతి విపత్తు అయినా, అధికారుల అనాలోచిత నిర్ణయాలైనా చిట్టచివరకు రైతులే నట్టేటమునుగుతున్నారు. మిగ్‌జాం తుపాను దెబ్బకు ఇప్పటికే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులను మరింత ఇబ్బందికి గురిచేస్తోంది. కాలువల్లో నీరున్నా చేలకు అందడంలేదని ఏలూరు జిల్లా రైతులు మండిపడుతున్నారు.
Eluru District :డెల్టాలో రబీ వరిసాగు కీలక దశకు చేరుకుంది. కాలువలకు ఎగువనున్న ప్రాంతాల్లో మరో తడి నీరందితే తప్ప పంట గట్టెక్కే పరిస్థితి కనిపించడంలేదు. మిగిలిన ప్రాంతాల్లో కనీసం రెండు మూడు వారాలు నీరందితే కానీ రైతులు తేరుకునే పరిస్థితి లేదు. ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిధిలోని వందలాది ఎకరాలు సాగునీరు అందక చివరి దశలో ఎండిపోతున్నాయి. కొవ్వలి ప్రాంతంలో సుమారు 450 ఎకరాల ఆయకట్టు నీళ్లు లేక బీటలు వారింది. గోదావరి కాలువకు చివరన ఉండే ఈ ఆయకట్టుకు కాలువలు, తూముల ద్వారా నీరు చేరుతుంది. ప్రస్తుతం గోదావరి కాలువలో పుష్కలంగా నీళ్లున్నా పొలాలకు మాత్రం నీరందడంలేదు.
"ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టాము. పంట చేతికి వచ్చే చివరి దశలో నీరు ఇవ్వకుండా అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వరి పంటకు ఒక తడి నీరు ఇస్తే పెట్టిన పెట్టుబడి అయినా వస్తుంది. లేకుంటే పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము"_ దెందులూరు రైతులు