Manchu Mohanbabu Family is Another Controversy : కుటుంబ అంతర్గత వివాదాలతో వీధికెక్కిన సినీనటుడు మోహన్‌బాబు కుటుంబం తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి అటవీ ప్రాంతం పక్కనే మోహన్ బాబు నివాసానికి సమీపంలో నెమళ్లు, జింకలు సహా వన్యప్రాణులు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు మేనేజర్ కిరణ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అడవిపందిని వేటాడి భుజాలపై మోసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
దీనిపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి చెప్పగా వన్యప్రాణులను శిక్షిస్తే అటవీ అధికారులు ఎలా ఊరుకుంటున్నారని నెటిజన్లు మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్, వాట్సాప్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడవి పందిని వేటాడి తీసుకెళుతున్న దృశ్యాలు తమ దాకా వచ్చాయని పహాడీషరీఫ్ ఎస్ఐ తెలిపారు. అయితే, వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ నెటిజన్లు ఆగ్రహించారు.
ఇదిలా ఉండగా విలేకరిపై దాడి కేసులో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మోహన్‌బాబు ప్రస్తుతం గుండె, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
మోహన్‌బాబుకు షాక్ - ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు