తెలంగాణ

telangana

ETV Bharat / state

9 ఏళ్ల నిరీక్షణకు తెర - రేషన్​ కార్డుల్లోకి కుటుంబ సభ్యుల పేర్లు - NEW RATION CARD UPDATES

రేషన్​కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేరుస్తున్న పౌర సరఫరాల శాఖ - 1.03 లక్షల మందివి చేర్పు - మరో 11.50 లక్షల మందివి పరిశీలనలో

New Ration Card Updates In Telangana
New Ration Card Updates In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 2:19 PM IST

New Ration Card Updates In Telangana :తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లూ చేరుతున్నాయి. పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లు, అత్తారింటి కార్డుల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను పౌర సరఫరాల శాఖ చేర్చుతుంది. మొత్తం 12.07 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా, 6.70 లక్షల కుటుంబాలు అర్హమైనవిగా ప్రాథమికంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. కొత్తగా 18.01 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు రాగా, వారిలో 11.50 లక్షల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. ఫిబ్రవరి తొలి వారం ఆఖరు వరకు 1.30 లక్షల మందిని రేషన్ ​కార్డుల్లో కొత్త లబ్ధిదారులుగా గుర్తించారు. 1,02,688 కార్డుల్లో వీరి పేర్లు చేర్చారు. మిగిలిన అర్హుల వివరాలను మళ్లీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అనుమతి ఇవ్వకపోవడంతో :కొన్ని కుటుంబాల్లో రేషన్‌ కార్డుల్లో తల్లిదండ్రుల పేర్లే ఉండి, పిల్లల పేర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ వారికి రేషన్‌ సరకులు పంపిణీ కాలేదు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినా రేషన్‌ కార్డులో పేరు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకమూ అందలేదు. అర్హత ఉన్నప్పటికీ రేషన్‌ కార్డుల్లో పేర్లు లేనివారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లను చివరిసారిగా 2016లో చేర్చారు. ఆ తర్వాత మీ-సేవా ద్వారా దరఖాస్తుల్ని స్వీకరించినప్పటికీ గత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇన్నేళ్లుగా వాటిని పరిశీలించలేదు.

కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అర్హులకు ప్రయోజనం కలుగుతోంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురి పేర్లను చేర్చాలని దరఖాస్తులు అందాయి. అయితే కొత్తగా చేర్చిన లబ్ధిదారుల సంఖ్యను పరిశీలిస్తే ప్రస్తుతానికి సగటున ఒక్కొక్కరినే లబ్ధిదారుగా చేర్చినట్లు తెలుస్తోంది. అదనంగా 1.03 లక్షల మందికి రేషన్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.31.36 కోట్ల భారం పడుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 1.03 లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు.

రెండు రకాలుగా పరిశీలన :దరఖాస్తుల్ని రెండు రకాలుగా పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాల సమాచారం. తొలుత దరఖాస్తులోని ఆధార్‌ సంఖ్య సరిగా ఉందా, లేదా? అన్నది చూస్తున్నారు. ఆ తర్వాత ఆయా పేర్లు ఇంకెక్కడైనా రేషన్‌ కార్డుల్లో ఉన్నాయా అని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిశీలిస్తున్నారు.

మీసేవలో ఇచ్చే రశీదు సివిల్​ సప్లై ఆఫీసులో ఇవ్వాల్సిన అవసరం లేదు : పౌరసరఫరాల శాఖ స్పష్టత

కొత్త రేషన్​కార్డుల దరఖాస్తులకు జనాలు క్యూ - జాతరను తలపిస్తున్న 'మీ-సేవ' కేంద్రాలు

కొత్త రేషన్‌కార్డుల కోసం మీ-సేవకు వెళ్తున్నారా? - ఇది తెలుసుకోకపోతే మీకే కష్టం

ABOUT THE AUTHOR

...view details