A Family Committed Suicide by Jumping into the Godavari River : అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల వేధింపులు ఓ చిరువ్యాపారి కుటుంబాన్ని చిదిమేశాయి. ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆ కుటుంబం గోదావరి నదిలోకి దూకింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆ చిరువ్యాపారి మృతిచెందగా, ఆయన భార్య సురక్షితంగా బయటపడ్డారు. వారి కుమార్తె గల్లంతయ్యారు.
గడువు ఇవ్వాలని కోరినా వినకుండా : స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ఉప్పలించి వేణు (54) తన భార్య అనూరాధ, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇరవై సంవత్సరాల క్రితం నిజామాబాద్‌కు బతుకుతెరువు కోసం వచ్చారు. న్యాల్‌కల్ రహదారి పక్కన కాలనీలో నివాసం ఉంటూ పాన్‌షాపును నడుపుతున్నారు. కొంతకాలంగా దుకాణం సక్రమంగా నడవకపోవడంతో కుటుంబపోషణ తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద వేణు రూ.3 లక్షల అప్పు తీసుకున్నారు. వడ్డీ సైతం సక్రమంగా చెల్లిస్తున్నారు. కాగా తీసుకున్న డబ్బు వెంటనే చెల్లించాలంటూ ఇటీవల అప్పులిచ్చినవారు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. గడువు ఇవ్వాలని కోరినా వినకుండా వేధింపులకు పాల్పడ్డారు.
ఆన్లైన్ బెట్టింగుల విషవలయం - కుమారుడి అప్పులు తీర్చలేక కుటుంబం బలవన్మరణం - Family Suicide Due to Betting Debts
గోదావరి వంతెన పైనుంచి నదిలో దూకి : తన చిన్నకుమార్తె పూర్ణిమ (25)కు పెళ్లిచూపులు జరిగాయని, అప్పు తీర్చడానికి సమయం ఇవ్వాలని వేడుకున్నా వారు మాత్రం వినలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వేణు, తన భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం వేకువజామున బాసరకు వచ్చి గోదావరి వంతెన పైనుంచి నదిలో దూకారు. అనూరాధ నీటి ప్రవాహానికి మొదటి స్నానాలఘాట్ వరకు కొట్టుకొచ్చారు. స్థానిక గంగపుత్రులు, భక్తులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ముథోల్ సీఐ మల్లేశ్, బాసర, ముథోల్ ఎస్సైలు గణేశ్, సాయికిరణ్ అక్కడికి చేరుకొని అనూరాధతో మాట్లాడి వివరాలు సేకరించారు.
పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం : అనంతరం ఆమె భర్త, కుమార్తె కోసం గాలించగా వేణు మృతదేహం లభ్యమైంది. పూర్ణిమ గల్లంతు కావడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల కోసం బాసర పోలీసులు నిజామాబాద్ వెళ్లగా వారు పరారైనట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేణు పెద్ద కుమార్తెకు వివాహం కాగా నాలుగేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఎంబీఏ చేసిన చిన్న కుమార్తె పూర్ణిమకు పెళ్లి కుదరగా ఇటీవలే నిశ్చితార్థం కూడా చేశారు. కొన్ని రోజుల్లోనే పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఇలా విషాదం అలముకుంది.
అప్పుల కోసం ఇంట్లో గొడవ- భార్యాపిల్లలను చంపేసిన పోస్ట్‌మ్యాన్- ఆపై సూసైడ్!
విజయవాడలో విషాదం - ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి - Doctor Family Suicide in Vijayawada