ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇక ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డు - ఏఐ ఆధారంగా పథకాల వర్తింపు - FAMILY BENEFIT CARD IN AP

ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డు - వివిధ ప్రభుత్వశాఖల సమాచారం ఏకీకృతం

Family Benefit Card in AP
Family Benefit Card in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 9:34 AM IST

Family Benefit Card in AP :ఏపీలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ బెన్‌ఫిట్‌ కార్డు(ఎఫ్‌బీసీ) ఇవ్వాలని సర్కార్ యోచిస్తోంది. ఇందుకోసం వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబ సమాచారాన్ని క్రోడీకరించి దీన్ని రూపొందించనుంది. దీని జారీలో ప్రధాన లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడం, వారిని ఆర్థికంగా పైకి తేవడం. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇందులో భాగంగా ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించి, వారికి ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలను విశ్లేషణ చేసి ఆ సభ్యుల ఆర్థికాభివృద్ధికి ఇంకా ఎలాంటి పథకాలు అవసరమో వాటికి అనుసంధానం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తనంతట తానే కుటుంబానికి ఏది అవసరమో ఉత్తమ ఎంపిక చేస్తుంది.

పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఏపీ సర్కార్ త్వరలో విడుదల చేయనున్న స్వర్ణాంధ్ర-2047(విజన్‌ డాక్యుమెంట్‌) సాధనకు ఇది కీలకంగా మారనుంది. ఇందుకు సంబంధించి మొబైల్‌ యాప్‌లో ఆయా కుటుంబాల సభ్యులూ ఈ సమాచారాన్ని అంతా చూసుకోవచ్చు. డిసెంబర్ 2న సచివాలయంలో సీఎం చంద్రబాబు దీనిపై వివిధ శాఖల అధికారులతోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో చర్చించనున్నారు. వారి నుంచి సూచనలు తీసుకోనున్నారు.

2019లోనే ఎఫ్‌బీసీని సిద్ధం చేసిన లోకేశ్‌ : 2019లోనే అప్పుడు మంత్రిగా ఉన్న లోకేశ్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డుకు సంబంధించిన కార్యక్రమ అమలును ప్రారంభించారు. ప్రపంచబ్యాంకుకు దీనిపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్ర డేటా సెంటర్‌లోని అన్ని వివరాలనూ దీనికి అనుసంధానించే చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే దీన్ని పక్కన పెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రభుత్వం వివిధ రకాలుగా కుటుంబాల సమాచారాన్ని సేకరిస్తోంది. అర్హులను వీటి ఆధారంగా ఎంపిక చేసి పథకాలను అమలు చేస్తోంది. పౌరసరఫరాలశాఖ (రేషన్‌కార్డులు), సెర్ప్‌ (పింఛన్లు, పొదుపు సంఘాలు), గ్రామ/వార్డు సచివాలయ (కుటుంబాల సమాచారం), పంచాయతీరాజ్‌(గృహనిర్మాణ), సీఎఫ్‌ఎంఎస్‌ (ప్రభుత్వ ఉద్యోగులు) తదితర శాఖల వద్ద ఏపీలోని కుటుంబాలు, అందులోని సభ్యుల సమాచారం ఉంది. టన్నిటినీ ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డు ద్వారా అనుసంధానించి ఒకే వేదికపైకి తెస్తారు.

కుటుంబానికి ఒక గుర్తింపు సంఖ్య (యూనిక్‌ ఐడీ) : ఎఫ్‌బీసీ అమల్లో భాగంగా కుటుంబానికి యూనిక్‌ ఐడీ ఇస్తారు. అందులో వారి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఉంటాయి. ఏ పథకం ద్వారా ఎంత ప్రయోజనం వస్తోంది? అనే సమాచారం ఉంటుంది. కొత్త పథకానికి అర్హులైతే కుటుంబ సభ్యుల్ని వాటికి అనుసంధానించి వర్తింపజేస్తుంది. లబ్ధిదారులు ఏదైనా పథకం తమకు వద్దనుకుంటే యాప్‌లోనే నిలిపివేసుకోవచ్చు. కుటుంబం పేరుపై ఉన్న నెలవారీ బిల్లులు, విద్యుత్ మీటర్ల వివరాలు ఇందులో కనిపిస్తాయి.

  • అన్నదాతలకు సంబంధించిన పొలం వివరాలు ఉంటాయి. ఇందులో ఈ-క్రాప్‌లో నమోదు నుంచి పెట్టుబడిసాయం, ఇతర పథకాలు, అందిన సాయం వివరాలు కన్పిస్తాయి.
  • గ్రామం నుంచి మరో గ్రామానికి, పట్టణానికి వలస వెళ్లినప్పుడు ఈ యాప్‌ ద్వారా చిరునామా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తారు.
  • రాష్ట్రంలో పట్టణాలు, నగరాలతోపాటు 13,000లకు పైగా గ్రామాలకు సంబంధించి మౌలిక సౌకర్యాలు, కుటుంబాల వివరాలు ఉంటాయి.

కొత్త జంటలకూ రేషన్ కార్డు - కుటుంబ సభ్యుల చిత్రాలతో సరికొత్తగా!

రేషన్ ​కార్డు ఉన్నవారికి​ గుడ్​న్యూస్ - నేటి నుంచి నాలుగు వస్తువులు సరఫరా

ABOUT THE AUTHOR

...view details