Fake Voters in Tirupati :తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేలా నేరపూరిత కుట్రలు పన్ని, వైఎసార్సీపీ ప్రభుత్వ పెద్దలు అమలు పరిచారు. ఈ నేరానికి తెగబడ్డ కుట్రదారుల గుట్టు బయటకు రాకుండా ఆ కేసులన్నింటినీ పోలీసులు ఆదిలోనే సమాధి చేసేశారు. దొంగ ఓట్లు వేసేందుకు పొరుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చిన వారిని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎక్కడికక్కడ పట్టుకొని, వీడియోలు తీసి, మనుషులతో సహా పోలీసులకు అప్పగించారు. వీడియో ఆధారాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ దారుణాలపై తిరుపతి తూర్పు, పశ్చిమ, అలిపిరి, ఎమ్మార్‌పల్లి, ఎస్వీ విశ్వవిద్యాలయం పోలీసుస్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై లోతైన దర్యాప్తు జరిపి పాత్రధారుల్ని, కుట్రదారుల్ని పట్టుకోవాల్సిన పోలీసులు ఆ కేసులన్నింటినీ నిర్వీర్యం చేసేశారు. ఆధారాలు సేకరించకుండానే దర్యాప్తును అటకెక్కించారు.
Tirupati Lok Sabha By Elections :తప్పుడు కేసులు అంటూ కొన్ని, 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' పేరిట మరికొన్ని, 'అన్‌డిటెక్టెడ్' అంటూ ఇంకొన్ని, 'యాక్షన్ డ్రాప్డ్' పేరిట మరోటి ఎత్తేశారు. తీవ్రమైన ఎన్నికల నేరం కేసును 'పబ్లిక్ న్యూసెన్స్' ఘటన కింద సెక్షన్ మార్చి, అసలు దోషుల్ని కాపాడారు. దొంగ ఓట్ల దందాలో తిరుపతి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి (MLA Bhumana Karunakar Reddy), ఆయన తనయుడు అభినయ్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలే కుట్రదారులని మొదటి నుంచీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారిపై ఫిర్యాదులూ చేశాయి. పెద్దలను కాపాడేందుకే దర్యాప్తు అధికారులు ఆయా కేసుల్లో ఇలా క్లోజర్ రిపోర్టులు సమర్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
YCP Removing TDP Votes: అనుకూలమైతేనే ఓటర్ల జాబితాలో పేరు.. ఇదే అధికార పార్టీ తీరు
YSRCP Irregularities in Elections :దొంగ ఓట్లు వేయించేందుకు పుంగనూరు, పీలేరు, నగరితో పాటు తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల నుంచి వేల మందిని తిరుపతికి తరలించారు. వీరికి ఉప ఎన్నిక పోలింగ్‌కు ఒకరోజు ముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో బస ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు ఉదయం విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లేసరికి వారందరినీ బస్సుల్లో వేర్వేరు పోలింగ్ కేంద్రాల వద్దకు పంపించేశారు. అంతమంది దొంగ ఓటర్లకు అక్కడ ఎవరు, ఎందుకు బస కల్పించారు? వారిని తరలించిన ముఖ్యనేత ఎవరు అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తే దారులన్నీ మంత్రి పెద్దిరెడ్డి వైపే తీసుకెళ్లుండేవి. దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 171ఈ, 188 కింద కేసు పెట్టినప్పటికీ ఆధారాలు సేకరించలేదు. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ కింద మూసేశారు.
Fake Voters in Tirupati Lok Sabha By Election :ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలిస్తున్న వారిని గుర్తించి అడ్డుకున్నారు. దీనిపై వీడియోలు తీసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా ఎన్నికల సిబ్బంది తిరుపతి తూర్పు ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 171ఎఫ్ కింద కేసు పెట్టారు. ఆయా వీడియోల్లోని వ్యక్తులు ఎవరు? వారిని ఎవరు తరలించారు అన్నది గుర్తించి లోతుగా దర్యాప్తు చేయకుండానే ఈ కేసును 'యాక్షన్ డ్రాప్డ్'గా పేర్కొని ముగించేశారు.