Fake SBI Reward Points Fraud :స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు కూడా అంతగానే పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్‌కాల్స్ చేయడం, లాటరీ తగిలిందని, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులని ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైన వారి ఖాతా నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. దీంతో సైబర్ నేరాల పట్ల ప్రజల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ప్రజల్లో అవహహన పెరిగే కొద్దీ సైబర్ మోసగాళ్లు తమ పంథాను మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఎస్బీఐ రివార్డ్స్ పేరిట నకిలీ లింకులను చేరవేసి డబ్బులను కాజేస్తున్నారు.
తెలిసిన నంబర్ల నుంచి మెసేజ్‌లు :నిర్మల్ పట్టణానికి చెందిన ప్రవీణ్‌కుమార్ స్థానికంగా వీడియోగ్రాఫర్. అతనికి పరిచయాలు ఎక్కువ. ఇతడి వాట్సప్ నంబరు నుంచి పలు గ్రూపులకు ఎస్‌బీఐ రివార్డ్స్ పేరిట సందేశం చేరడంతోపాటు ఓ లింకు కూడా జతైంది. ఎందుకిలా పంపిస్తున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరిద్దరు అతడికి కాల్ చేసి విషయంపై అడిగారు. తన ఫోన్‌లో వాట్సప్ పనిచేయడం లేదని, తనకు తెలియకుండానే ఎవరో హ్యాక్ చేశారని చెప్పడంతో వారు షాకయ్యారు. లింకులేవీ తెరవొద్దని సూచించడంతో అందరు జాగ్రత్త పడ్డారు.
సీఎస్ పేరుతో ఫేక్ కాల్స్ - సైబర్ టీమ్‌కు శాంతి కుమారి కంప్లైంట్ - Cyber Criminals Use CS Picture
ఇటీవల జైనూరు మండలం శివునూర్‌కు చెందిన ఓ యువ రైతు ఈ లింకు బారిన పడి భారీగా డబ్బులు నష్టపోయారు. తమ గ్రామం పేరిట ఉన్న వాట్సప్ గ్రూపులో ఎస్‌బీఐ రివార్డ్స్ లింకు రావడంతో నిజమేననుకుని దాన్ని తెరిచారు. అతడి ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా అయినట్లు సందేశం రావడంతో షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు, బ్యాంకు మేనేజరుకు ఫిర్యాదు చేశారు.
ఇవి తాజాగా ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఘటనలు అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట వాట్సప్‌లో రివార్డ్స్ లింకు విస్తృతంగా ప్రచారం అవుతోంది. తెలిసిన నంబర్ల నుంచే ఇది వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని నమ్మి లింక్ తెరుస్తున్నారు. ఫలితంగా సులభంగా మోసపోయేందుకు అవకాశం ఉంటోంది.