Fake Doctors Issue in Telangana State Wide :ఎలాంటి అర్హతలు లేకుండానే కొందరు ‘వైద్యులు’గా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి తమ వీడియోల్లో చెప్పినట్టు చేస్తే మీకు రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయంటూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా ఆకర్షిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
వారు చెప్పినవి పాటించడమే కాకుండా స్టేటస్ పెట్టుకొని ప్రచారం చేయడంతో మరికొందరు ప్రజలు నకిలీ వైద్యుల వలలో పడుతున్నారు. నగరాలు, పల్లెలనే తేడాల్లేకుండా ఇలాంటివారు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. వీరికి వైద్య పట్టాలు లేకున్నా ఇంగ్లీషు వైద్యం, ఆయుర్వేదం, హోమియో డాక్టర్లమంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచిస్తున్నారని తెలంగాణ వైద్యమండలి వైద్యులు చెబుతున్నారు.
ఒకవైపు వాడవాడలా నకిలీ వైద్యులు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుండగా మరోవైపు సోషల్ మీడియాలో నకిలీ వైద్యులు కొత్త రకాల మందులను, డైట్లను సూచిస్తూ వైరల్ అయ్యేలా చూస్తుండటం, వాటి బారిన ప్రజలు పడుతుండటం ఆందోళన కలిగించే అంశం.
ధనార్జనే ధ్యేయంగా మిడిమిడి జ్ఞానంతో వీరు అందిస్తున్న ‘వైద్యానికి’ పలుచోట్ల పిల్లలు, గర్భిణులు, వయోధికులు సహా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వి. రాంబాబు అనే వ్యక్తి ఎలాంటి అర్హతలు లేకున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌గా చలామణి అవుతుండగా, మెడికల్ కౌన్సిల్ అధికారులు ఈ నకిలీ వైద్యుడిని ఇటీవల హైదరాబాద్‌లో పట్టుకున్నారు. ఇలాంటి నకిలీలపై తెలంగాణ వైద్యమండలికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సోదాలు చేపట్టారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 350 మందికిపైగా పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.
నకిలీ వైద్యుల ఉదంతాలెన్నో..!
- తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో గుండెపోటుకు గురైన రోగికి ఓ నకిలీ వైద్యుడు అధిక మోతాదు ఇంజెక్షన్ చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పరిగిలోనే మరో నకిలీ వైద్యుడు ఎంబీబీఎస్ చదవకున్నా ఆ స్థాయి డాక్టర్‌గా చలామణి అవుతున్నాడు.
- గత నెలలో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించగా అతను గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మహిళకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరికొన్ని మాత్రలిచ్చాడు. పరిస్థితి విషమించగా చివరకు వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సి వచ్చింది.
- మంచిర్యాల జిల్లాలో పదేళ్ల చిన్నారికి వైరల్ జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఓ ‘వైద్యుడి’ వద్దకు తీసుకెళ్లగా హైడోసు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ బాలిక కన్నుమూసింది.
- మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలిక (16)ను జ్వరం, వాంతులతో ఓ ‘క్లినిక్’కు తీసుకెళ్లారు. అక్కడి ‘వైద్యుడు’ సెలైన్ పెట్టి 4 ఇంజెక్షన్లు ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వైద్యం పేరుతో నకిలీ డాక్టర్... ఉద్యోగాల పేరిట కానిస్టేబుల్.. సీన్ కట్ చేస్తే..!