Fake Beneficiaries at TIDCO Houses in Tirupati District : పట్టణ ప్రాంత పేదప్రజల సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో తెలుగుదేశం హయాంలో చేపట్టిన టిడ్కో గృహనిర్మాణాలు పేదలకు అందని ద్రాక్షగానే మిగిలాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అర్హులు కాని వారు సైతం రాజకీయ పలుకుబడితో ఇళ్లను దక్కించుకున్నారు. దీంతో అసలైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగింది. దీనికి తిరుపతి జిల్లాలో వెలుగుచూసిన ఉదంతమే నిలువెత్తు సాక్ష్యం. జిల్లాలోని వెంకటగిరిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కొందరు అమ్ముకున్నారు. అలాగే మరికొందరు అద్దెలకు ఇస్తామని టులెట్ బోర్డులు పెట్టారు. తాజాగా టిడ్కో ఇళ్లను పరిశీలించాడానికి వెళ్లిన కూటమి నేతలు అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యారు.
'వామ్మో టిడ్కో ఇళ్లా? మాకొద్దు' - సీఆర్డీఏ నోటీసులతో ఉలిక్కిపడుతున్న లబ్ధిదారులు
వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు : తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పేదల సొంతింటి కలను నెరవేర్చాలని టీడీపీ హయాంలో దాదాపు 3 వేలకు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు హయాంలోనే 1100 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తరువాత ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవే ఇళ్లకు పార్టీ రంగులు వేసి అనర్హులకు పంపిణీ చేశారు. అనంతరం నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. తాజాాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి రూ.11 కోట్లను కేటాయించింది. అయితే నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లిన కూటమి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విస్తుపోయే నిజలు తెలుసుకున్నారు.