Bus Ticket Fare Extra Collected at Karimnagar : నిత్యం రద్దగీ ఉండే మార్గాల్లో హనుమకొండ, కరీంనగర్ వైపు వెళ్లే మార్గం కూడా ఒకటి. వరద ముంపు ఎదుర్కొంటుండంతో, ఈ మార్గంలో హనుమకొండ నయీంనగర్ నాలా విస్తరణ పనుల్లో భాగంగా ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లోనే పనులు మొదలయ్యాయి. మూడు నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని చెప్పినా, ఇంతవరకూ పనులు పూర్తికాలేదు.
వర్షాకాలం కావడంతో పనులకు అడపాదడపా ఆటంకం కలుగుతుంది. వంతెన నిర్మాణం చేస్తుండడంతో, హనుమకొండ నుంచి కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట, హుస్నాబాద్, హూజూరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ఇతర వాహనాలను ములుగు రోడ్ కేయూ క్రాస్ రోడ్ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో నాలుగు కిటోమీటర్ల మేర దురాభారం పెరిగింది.
తక్షణమే అదనపు భారాన్ని తగ్గించాలి :ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికుల పైనే వేస్తోంది. ఆర్టీసీ లెక్కల ప్రకారమే, నాలుగు కిలోమీటర్లకు 6 రూపాయలు కాగా రౌండ్ఫిగర్ పేరుతో పది రూపాయల ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. ఓ వైపు చుట్టూ తిరిగి వెళ్లేందుకు అరగంట సమయం వృధా కావడమే కాకుండా, అదనంగా పది రూపాయలు వసూలు చేయడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు. తక్షణమే అదనపు భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.
"గత ఆరు నెలలుగా ఆ బ్రిడ్జి నిర్మాణం అవుతూనే ఉంది. ఆ రూట్లలో బస్సుల్లో వెళ్లే మాకు ప్రయాణ రుసుము అదనంగా వసూలు చేస్తున్నారు. రూ.10 ఎక్కువ ఛార్జి అవ్వటమే కాకుండా, సమయం కూడా వృధా అవుతుంది. ఏదేమైనా సరే ఇలా బస్సు దారి మళ్లింపునకు, మమ్మల్ని భాదితులను చేస్తూ మా దగ్గర ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు." -ప్రయాణికులు