Minister Kollu Ravindra Review on New Liquor Policy:మద్యం పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అవకతవకలకు తావివ్వకుండా చూడాలని అధికారులకు సూచించారు. నూతన మద్యం పాలసీ, మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మద్యం సిండికేట్లు వ్యవహారంపై అధికారుల నుంచి వివరణ కోరారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బెదిరిస్తున్నారనే అంశాన్ని మంత్రి ఖండించారు. ఎక్సైజ్ అధికారులు ఎవరైనా సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించొద్దని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.
దరఖాస్తుల దాఖలు నుంచి షాపుల కేటాయింపు వరకు పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. లక్ష దరఖాస్తులు లక్ష్యంగా నిర్దేశించుకోగా 56 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వచ్చే 2 రోజుల్లో లక్ష్యాన్ని సాధించేలా చూడాలని ఆదేశించారు. చివరి 2 రోజుల పాటు ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. కొన్ని జిల్లాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి దరఖాస్తులు రావడం పట్ల సిబ్బందిని అభినందించారు. అదే స్ఫూర్తితో ప్రతి ఒక్క జిల్లాలో దరఖాస్తుల దాఖలుపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. అక్టోబరు 16వ తేదీ నుంచి కొత్త దుకాణాలు, కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.