Excavation for Hidden Treasures in Warangal District :వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని కమ్మపల్లి పాత గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి గుప్తనిధులు తవ్వుతున్నారన్న సమాచారంతో తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఆ సమయంలో కొంతమంది దుండగులు జేసీబీల సహాయంతో తవ్వకాలు చేస్తున్నట్లుగా సమాచారం.
పోలీసుల రాకతో పారిపోయిన దుండగులు :పోలీసులను గమనించిన దుండగులు పారిపోతుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఒక జేసీబీతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసింది. మరికొంతమంది పోలీసులకు చిక్కకుండా పారిపోగా, వారు తీసుకొచ్చిన కారును ఎవరూ తీసుకెళ్లకుండా టైర్లలో గాలిని తీసేసినట్లుగా సమాచారం.
"శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మా గ్రామానికి సీఐ రైడ్‌కు వచ్చినట్లుగా సమాచారం. ఏం జరిగిందోనని గ్రామస్థులు భయాందోళనలకు గురికావడం జరిగింది. ఈ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారంతోనే పోలీసులు వచ్చినట్లుగా తెలిసింది. జేసీబీలతో పాటు మరికొన్ని వాహనాలను సీజ్ చేసినట్లుగా సమాచారం. గుప్తనిధుల తవ్వకాలు లాంటి పనులు చేస్తే మా ఊరికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడున్న ప్రజలు భయాందోళనలకు గురవ్వడం బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం"- కృష్ణ, గ్రామస్థుడు