Jaipal yadav Attends Phone Tapping Case Investigation :ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు దాదాపు రెండు గంటల పాటు జైపాల్‌యాదవ్‌ను విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు జైపాల్ యాదవ్ తెలిపారు. తిరుపతన్న తమ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఓ కుటుంబ వివాదాన్ని పరిష్కరించే సమయంలో ఇద్దరు కలిసినట్లు పేర్కొన్నారు. తాను ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లను తిరుపతన్న ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు వివరణ కోరారని వారు కొన్ని ఆధారాలు ముందు పెట్టి విచారణ చేశారని వివరించారు.
"తిరుపతన్న ద్వారా ట్యాపింగ్ చేయించాననే ఆరోపణలతో పోలీసులు నోటీసులిచ్చారు. 2 కుటుంబాల మధ్య విభేదాల కేసులో 2 ఫోన్‌నంబర్లు ఇచ్చాను. రెండు ఫోన్‌నంబర్లను ట్యాపింగ్ చేసిన సంగతి తెలియదు. ఓ వివాదం పరిష్కారం కోసం అదనపు ఎస్పీ తిరుపతన్నను కలిశాను. తిరుపతన్న మా సామాజికవర్గానికి చెందిన వాడు కావడంతో కలిశాను. పోలీసులు కొన్ని ఆధారాలు ముందు పెట్టి విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్తాను. "- జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే