EX Minister Vidadala Rajini Took 2Cr Bribe According To Vigilance Report :పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చింది. అందులో రూ.2 కోట్లు విడదల రజిని, రూ.10 లక్షలు జాషువా, మరో రూ.10 లక్షలు రజిని పీఏ తీసుకున్నట్లు నిర్ధారించింది.
వీరందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాషువాపై అఖిల భారత సర్వీసుల నియామవళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించిన, నివేదికలో పొందుపరిచిన అంశాలివి.
క్రషర్ సీజ్ చేయమంటారా? :2020 సెప్టెంబరు 4న విడదల రజిని (అప్పటికి ఎమ్మెల్యే) పీఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారు. వారు ఆమెను కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండు చేశారు. తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా ఆర్‌వీఈవో (రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి)గా ఉన్న పల్లె జాషువా క్రషర్‌లో తనిఖీలు చేశారు.