Ex Minister KTR on Women Safety in Telangana :రాష్ట్రంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గు చేటని ఆవేదన చెందారు. ఈ క్రూరమైన చర్యలతో మహిళలకు భద్రత లేదని అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న పరిస్థితిని ఎత్తిచూపుతున్నాయని తెలిపారు.
ఎనిమిది నెలలు గడిచినా రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభావం నేరాలు పెరగడానికి ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన దారుణ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు : గత నెల 30వ తేదీన కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెలుతున్న బస్సులో జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఆమె డయల్ 100కు ఫిర్యాదు చేయడంలో పోలీసులు మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా మహిళ ఫిర్యాదుతో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు కోసం గాలించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్చేసి పట్టుకున్నారు. డ్రైవర్ కృష్ణ పరారీ అయ్యాడు. మరో డ్రైవర్ సిద్ధయ్యను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. అనంతరం నేడు డ్రైవర్ కృష్ణను పోలీసులు పట్టుకున్నారు.