Tirupatanna Statement on Phone Tapping Case :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అదనపు ఎస్పీ తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసులో అరెస్టైన రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు కస్టడీ వేళ ఇచ్చిన వాంగ్మూలాలను ఇప్పటికే బయటపెట్టిన పోలీసులు, తాజాగా తిరుపతన్న వాంగ్మూలాన్నీ వెల్లడించారు. ప్రభాకర్‌రావు, భుజంగరావు ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు తిరుపతన్న తన వాంగ్మూలంలో తెలిపారు.
ప్రతిరోజు 40-50 మంది సెల్‌ఫోన్లను ట్యాప్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు, భుజంగరావు ఆదేశాలతో, బీఆర్ఎస్ ప్రత్యర్థులపై మెరుపు దాడులు నిర్వహించి డబ్బులు పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ విధమైన చర్యలు కోసం ఇద్దరు సీఐలు, 20 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నామని, రోజుకు 40 నుంచి 50 మంది సెల్‌ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు చెప్పారు. 3 ఉపఎన్నికలతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో తాను పనిచేసినట్లు తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలంలో పోలీసులు నమోదు చేశారు.
ప్రతిపక్ష నేతల డబ్బులపై ప్రత్యేక నిఘా :ఇందులో భాగంగా 'పీఓఎల్- 2023' పేరుతో ప్రత్యేక ఎలక్షన్ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు వివరంచారు. కొన్ని సందర్భాల్లో ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్‌లతో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారంతో విపక్షాల సానుభూతిపరుల నుంచి డబ్బులను సీజ్ చేసినట్లు చెప్పారు. కొల్లూరులో రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, మరో మిత్రుడు కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు.