EVMs Moved to Strong Room After Polling in AP :ఎన్నికల్లో ఓ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటివరకు ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవిష్యత్‌ను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. దీంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. అన్ని స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని బిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ ముగిసాక ఈవీఎంలను పోలీసుల భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించారు. మడకశిర,పెనుగొండ,కదిరి, హిందూపురం అసెంబ్లీ ,పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎంలకు వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి అందులో భద్రపరిచారు.
Guntur District :గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో చిన్నపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం మిషన్లను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు చోట్ల ఈవీఎంల మొరాయింపుతో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎం మిషన్లను జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. పోలింగ్ ఆలస్యం అయిన వాటి కోసం అర్ధరాత్రి దాటినా ఈవీఎంలు తీసుకునేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. స్ట్రాంగ్ రూం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు