సకుటుంబ సపరివార సమేతంగా అక్రమాలు - ఆయనకు అడ్డు చెప్పే వారే లేరు! YCP MLA irregularities in Krishna district: ఉమ్మడి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతంలోని ఒక నియోజకవర్గం, మరో తెలుగు రాష్ట్రం తెలంగాణకు సరిహద్దుగా ఉండటాన్ని అధికార పార్టీ నేతలు తమ అక్రమాలకు అనువుగా మార్చుకున్నారు. ఇటువంటి సరిహద్దుల వద్దే కనిపించే తనిఖీ కేంద్రాలూ వారికి కల్పతరువుగా మారాయి. గత ఐదేళ్ల పాలనలో ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఒరిగింది శూన్యం. కానీ, ఇక్కడి ప్రజాప్రతినిధి మాత్రం కోట్లకు పడగలెత్తారు. ఆదాయ వనరులున్నాయి, దందాకు ఎదురుచెప్పేవారే లేరు.
ఈ నియోజకవర్గంలో మట్టి దందా అంతా ప్రజాప్రతినిధి వియ్యంకుడి చేతుల్లోనే ఉంది. కొన్ని కాంట్రాక్టులు తీసుకుని విజయవాడ సమీపంలోనూ మట్టి దందా చేశారు. పోలవరం కాలువ గట్లనూ కొల్లగొట్టారు. నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కనే శ్రీ కొనగిరి మల్లికార్జునస్వామి కొండకు నున్నగా గుండు కొట్టారు. సగటున వంద టిప్పర్ల చొప్పున లెక్కేసినా.. రోజుకు 6 లక్షలు గడించారు. జగనన్న లేఅవుట్ల చదును పేరుతో కోట్లలో బిల్లులు తీసుకున్నారు. కొండ పక్కనే ఉన్న ఎసైన్డ్ భూములనూ మింగేశారు. అదేమంటే, లబ్ధిదారులను బెదిరించి నామమాత్రంగా ఎంతో కొంత ఇచ్చి నోరు మూయించారు. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని ఒక దేవాలయం పక్కనే ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ భూముల్లోనూ గ్రావెల్ తవ్వేశారు. వేములనర్వ వద్ద ఎత్తయిన కొండను పిండి చేశారు.
రాజకీయంగా చైతన్యవంతమైన ఈ నియోజకవర్గాన్ని ప్రజాప్రతినిధి వియ్యంకుడు, అతడి సోదరుడు కలిసి అరాచకాలకు అడ్డాగా మార్చేశారు. 2020లో ఒక నేత హత్య కేసులో వీరి ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ నాయకులపైనే కేసులు పెట్టి జైలుకు పంపారు. మల్లికార్జునస్వామి కొండకు ఆనుకొని జాతీయ రహదారి పక్కన సుమారు 10 ఎకరాల విలువైన భూమి ఉంది. దీన్ని 70-80 ఏళ్లుగా ఓ గ్రామానికి చెందిన 23 ఎస్సీ కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. ఎకరం సుమారు 5 కోట్లు పలికే ఈ భూములను ఎలాగైనా కాజేయాలని ప్రజాప్రతినిధి విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు అక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేసి దళితులకు భూములు లేకుండా చేశారనే విమర్శ ఉంది.
ఈ నియోజకవర్గం పక్కనే కృష్ణా నది, మరోవైపు ఉపనది మున్నేరు ఉండటంతో ఇసుకకు కొదవ లేదు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడించి మొదలు, వియ్యంకుల సోదరుల దృష్టి ఇసుక తవ్వకాలపై పడింది. ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నదీ తీరాల నుంచి అందినకాడికి ఇసుకను తోడేశారు. ఊరికో క్వారీ తెరిచి అక్రమ రవాణాకు పాల్పడ్డారు. తమ దందాను అడ్డుకున్నారని ఓ సీఐని బదిలీ చేయించారు. వార్తలు రాశారని అధికార పార్టీకి చెందిన పత్రికా విలేకరిని తీసేయించారు. తమకు సహకరించే తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులను తీసుకొచ్చారు. వీరి ఆగడాలను వ్యతిరేకించిన సొంత గ్రామానికి చెందిన ఇద్దరు నేతలు హత్యకు గురయ్యారు. ఈ ఘటనల్లో వియ్యంకుల సోదరులపై ఆరోపణలు వచ్చాయి.
అరాచక 'గ్రంథం'- గోదావరి జిల్లాల్లో పేట్రేగిపోతున్న వైసీపీ నేత - YSRCP Leader Irregularities
అర్ధాంగి అనే పదానికి ఈ ప్రజాప్రతినిధి సతీమణి ఉదాహరణగా నిలుస్తున్నారు. భర్త అధికారాన్ని తన గుప్పిట పెట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. పోలీసులైనా, ఇతర శాఖల అధికారులైనా, బదిలీలు కావాలంటే ఆమెను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అందుకు తగినంత కూడా ముట్టజెప్పాల్సి ఉంటుంది. చౌక బియ్యం అక్రమ రవాణా వ్యాపారానికి ఈమే రింగ్ లీడర్ అని చెబుతుంటారు.
గంజాయి అక్రమ రవాణా కేసులో ఈ ప్రజాప్రతినిధి కుమారుడికి ప్రమేయం ఉందని చెబుతుంటారు. ఒకసారి విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతస్థాయిలో పలుకుబడి ఉపయోగించి, అతనిని కేసు నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. ఇక ఈ నియోజకవర్గంలోనే పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయం ఉంది. ఈ దేవస్థానానికి చెందిన ఏడు ఎకరాల విలువైన భూమిని కాజేసేందుకు పర్యాటక శాఖను అడ్డుపెట్టుకొని వ్యవహారం నడిపించారీ ప్రజాప్రతినిధి. లీజు పేరుతో దక్కించుకునేలా ఎత్తులు వేశారు. ఈ ప్రయత్నాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో వెనక్కితగ్గారు.
గోదావరి జిల్లాల్లో ఆయన ఓ అరాచక 'గ్రంథం'! - YCP leader irregularities