TDP YCP Victory Chances in Anantapur: అనంతపురం పార్లమెంటు పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అత్యంత రాజకీయ అనుభవం ఉన్న నేతలు, వైసీపీ, టీడీపీల నుంచి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచారు. ఈ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా, 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా ఉన్నప్పటికీ, ఉరవకొండలో టీడీపీ గెలుపు బావుటా ఎగురవేసింది. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారంతా ప్రకృతి వనరులను దోచుకున్నవారు కొందరైతే, భూ దందాలు చేసి ఓటేసి గెలిపించిన ప్రజలను పీడితులుగా చేసిన వారు మరికొందరు.
అనంతపురం ఎంపీ స్థానం బరిలో ఈసారి తెలుగుదేశం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించారు. వైసీపీ నుంచి కురబ సామాజిక వర్గానికి చెందిన మాలగుండ్ల శంకరనారాయణను బరిలోకి దింపారు. 2019లో గెలిచిన వైసీపీ ఎంపీ రంగయ్య ఐదేళ్లుగా అనంతపురానికి చేసిందేమీ లేదని ప్రజల అభిప్రాయం. పెనుకొండ ఎమ్మెల్యేగా, కొంతకాలం మంత్రి పదవిలో తీవ్ర వ్యతిరేకత ఉన్న శంకరనారాయణకు,అనంతపురం MP ఎంపీ టికెట్ ఖరారు చేశారు. అందరివాడిగా పేరున్న అంబికా లక్ష్మీనారాయణకు, అవినీతి ఆరోపణలున్న శంకరనారాయణకు మధ్య పోటీ నెలకొంది. వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అభివృద్ధి లో వైఫల్యం కారణంగా తన గెలుపు తథ్యమని టీడీపీ అభ్యర్థి చెబుతున్నారు.
అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో అనంతపురం అసెంబ్లీ స్థానం అత్యంత కీలకమైనది. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో చాలా వరకు విద్యావంతులైన ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. 2.78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇంతటి కీలక నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే బరిలో నిలిచారు. గత ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన వెంకటరామిరెడ్డి ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నగరానికి డంప్ యార్డు, భూగర్భ డ్రైనేజీ సమస్య తీరుస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యారు. టీడీపీ నుంచి మాజీ ఎంపీపీ దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ బరిలో నిలిచారు. పారిశ్రామికవేత్త అయిన ప్రసాద్‌కు ఎంపీపీగా మంచి గుర్తింపు, అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. అధికారపార్టీ ఎమ్మెల్యే వైఫల్యాలే తన గెలుపును సులభతరం చేస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండ రాజకీయంగా మరో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. టీడీపీ నుంచి నాలుగోసారి పయ్యావుల కేశవ్ బరిలోకి దిగారు. వరుస హ్యాట్రిక్‌లు కొట్టిన కేశవ్‌కు ఈసారి గెలుపు నల్లేరుమీద నడకలా మారనుంది. వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విశ్వేశ్వరరెడ్డికి ఆయన కుమారుడు, తమ్ముడు పెద్ద సమస్యలుగా మారారు. ఆయన కుమారుడిపై భూఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. విశ్వేశ్వరరెడ్డికోసం అనేక త్యాగాలు చేసిన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయించారన్న అపవాదు మూటగట్టుకున్నాడు. మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తన అన్నకు ప్రత్యర్థిగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓట్లు పెద్దఎత్తున చీలనున్నాయి. ఇది పయ్యావుల కేశవ్ కు అనుకూలంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాయదుర్గం అసెంబ్లీ స్థానంలో టీడీపీ , వైసీపీ నుంచి రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు సీనియర్ నేతలు బరిలో పోటీ తలపడుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులు బరిలో దిగారు. 2019లో వైసీపీ నుంచి గెలుపొందిన కాపు రామచంద్రారెడ్డిపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటంతో ఈసారి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన భాజపా లో చేరి, గత ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన కాలవ శ్రీనివాసులును గెలిపించాలంటూ, ప్రచారం చేస్తున్నారు. వైసీపీ తరఫున బరిలో నిలిచిన మెట్టు గోవిందరెడ్డి గెలుపు అసాధ్యమే అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీలు అధికంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో మెట్టు గెలుపు సులువు కాదని విశ్లేషకులు చెబుతున్న విషయం. ఐదేళ్లుగా రాయదుర్గంలో వైసీపీ అరాచకాలు, అక్రమాలపై యుద్ధం చేసిన కాలవ శ్రీనివాసులు తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు, రాజకీయ నాయకుల దృష్టంతా కళ్యాణదుర్గం మీదనే ఉంది. ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశించి భంగపడిన ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఈసారి టికెట్ తమకే వస్తుందని భావించారు. గత ఎన్నికల్లో ఉన్నం హనుమంతరాయచౌదరిని కాదని ఉమామహేశ్వరనాయుడుకు టీడీపీ టికెట్ ఇచ్చారు. ఆయన అందరితో కలిసి పనిచేయని కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ బరిలో తెలుగుదేశం నుంచి అమిలినేని సురేంద్రబాబు పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, తలారి రంగయ్య బరిలో నిలిచారు. 2019లో వైసీపీ నుంచి గెలుపొందిన మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీతో పాటు, ఆమె భర్త భూ దందాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరోసారి వైసీపీ నుంచి ఆమె కళ్యాణదుర్గంలో గెలిచే అవకాశం లేదని అన్ని సర్వేలు చెప్పడంతో, మంత్రి ఉషను పెనుకొండకు బదిలీచేసి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించారు.