Electrification Activity To Waste:రాష్ట్రంలో రోజుకు దాదాపు 6,890 టన్నుల వ్యర్థాలు పట్టణాలల్లో రోడ్లమీదకు వస్తున్నాయి. ఇందులో సుమారు 1,800 టన్నుల చెత్తను రెండు విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలిస్తున్నారు. 2,545 టన్నులు సేంద్రియ ఎరువుల తయారీ, సిమెంట్ ప్లాంట్లకు తరలి వెళుతోంది. మిగలిన 50% వ్యర్థాలు రోజూ డంపింగ్ యార్డులకు చేరుతున్నాయి.ఈ విధంగా డంపింగ్ యార్డుల్లో 85 లక్షల టన్నుల దాకా వ్యర్థాలు పేరుకుపోయాయి.
డంపింగ్ యార్డులకు బదులు ప్లాంట్లు: పట్టణాల్లో చెత్త, వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఇందుకుగాను వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి ప్లాంట్లు విశాఖపట్నం, గుంటూరులో ఉన్నాయి. అందుకోసం రాజమహేంద్రవరం, నెల్లూరు, కర్నూలులో అదనంగా మరో మూడు ప్లాంట్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జిందాల్ సంస్థతో ప్రభుత్వం సంప్రదిస్తోంది. పట్టణాల్లో రోజూ వచ్చే వ్యర్థాలు డంపింగ్ యార్డులకు బదులు నేరుగా ప్లాంట్లకు వెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
కరవు కథాచిత్రం.. ఎండిన నదులు, చెరువులు.. 500 ఏళ్లలో లేని దుర్భర పరిస్థితులు
పన్నుల భారాన్ని మోపిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి ఆరు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. విశాఖ, గుంటూరులోని రెండు ప్లాంట్లకూ అప్పట్లోనే భూమిపూజ సైతం జరిగింది. తర్వాత 2019 లో వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మిగతా ప్రాంతాల్లో ప్లాంట్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇళ్ల నుంచి చెత్త సేకరించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టి ప్రజలపై పన్నుల భారాన్ని మోపింది. పట్టణాల్లో చెత్త సమస్యే లేకుండా చేస్తామని చెప్పి డంపింగ్ యార్డులను వ్యర్థాలతో నింపేసింది.